2 కంట్రీస్

సునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “2 కంట్రీస్”. అసలే వరుస పరాజయాలతో పూర్తిస్థాయిలో చతికిలపడిన సునీల్ కి చాలా కీలకమైన చిత్రంగా ఈ ఏడాది చివరలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : ఉల్లాస్ (సునీల్) వ్యక్తిత్వం అనేది లేకుండా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని కన్న తల్లిదండ్రులకు సైతం గౌరవమర్యాదలు ఇవ్వకుండా బ్రతికుతుంటాడు. పొరపాటున తాను చిన్నప్పుడు ఇష్టపడ్డ లయ (మనీషా రాజ్)ను ఆన్ లైన్ లో ఇష్టపడి, చూశాక మనసుపడి మనువాడతాడు.

కట్ చేస్తే.. లయ పచ్చి తాగుబోతని తెలుస్తుంది. అయితే ఆమెకున్న 500 కోట్ల ఆస్తి కోసం ఆమెతో ప్రేమ నటిస్తుంటాడు ఉల్లాస్. వీరి అబద్ధపు-అవసరపు ప్రేమ స్వచ్చమైన బాంధవ్యంగా రూపాంతరం చెందేలోపే ఇద్దరి మధ్య విడాకులు తీసుకొనే స్థాయి గొడవలు జరుగుతాయి.
చివరికి ఉల్లాస్ స్వచ్చమైన ప్రేమను లయ అర్ధం చేసుకొందా? ఇద్దరూ కలిశారా? అనేది “2 కంట్రీస్” కథాంశం.

నటీనటుల పనితీరు : సునీల్ నటించడం మర్చిపోయాడా లేక సినిమా మీద ఇంట్రెస్ట్ లేకుండా నటించాడా అనిపిస్తుంది ఈ సినిమాలో సునీల్ నటన చూస్తే. అసలు కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా నటించిన సునీలేనా ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేసేసి అనిపించకమానదు. హీరోయిన్ మనీషా రాజ్ చూడ్డానికి దబ్బపండులా అందంగా కనిపించినప్పటికీ.. పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం కనీసం తేలిపోయింది. ఎన్నారై బాడీలాంగ్వేజ్ కి అమ్మడు సరిగ్గా సూట్ అయినా నటనలో ఓనమాలు కూడా తెలియకపోవడంతో ఆమెని చూస్తూ ఆనందించాలో అమ్మడి నటన చూసి చిరాకుపడాలో అర్ధంకాని కన్య్ఫ్యూజన్ లో ఉంటారు ప్రేక్షకులు.

ఇక ఇవివి గారి సినిమాల్లో కనిపించినట్లుగా లెక్కకు మిక్కిలి కామెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాలో ఉన్నప్పటికీ.. ఎవరికీ సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడంతో ఏ ఒక్కరి పాత్ర ప్రేక్షకులకు రిజిష్టర్ అవ్వదు. పైగా.. అమెరికాలో ఉంటున్నారు అనే ఒకే ఒక్క కారణంతో నరేష్, సంజనలతో ఎన్నారై తెలుగు స్లాంగ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు : గోపీసుందర్ పాటలు బాలేక, నేపధ్య సంగీతం సన్నివేశానికి తగ్గట్లుగా లేకపోవడంతో.. సంగీత దర్శకుడిగా అతడు ఫెయిల్ అయ్యాడు. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది కానీ.. సన్నివేశంలో కానీ కథలో కానీ దమ్ము లేకపోవడంతో రాంప్రసాద్ ఎంత కష్టపడినా అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాత అయిన ఎన్.శంకర్ “జై బోలో తెలంగాణా” లాంటి మంచి విజయం అనంతరం అది కూడా దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం దర్శకుడిగా తన రీఎంట్రీకి మలయాళంలోనే యావరేజ్ గా ఆడిన “2 కంట్రీస్”ను ఎందుకు ఎంపిక చేసుకొన్నాడనేది ఆయనకే తెలియాలి. పోనీ మలయాళం వెర్షన్ లో దొర్లిన తప్పులను తెలుగులో ఏమైనా రిపీట్ చేయకుండా ఉన్నాడా అంటే కనీసం సీన్ కంపోజిషన్ ను కూడా మార్చలేదు. సినిమాలో ఏ ఒక్క సన్నివేశంలోనూ ప్రేక్షకుడు సెంటిమెంట్ లేదా కామెడీ ఫీల్ అవ్వకుండా రెండు గంటలపాటు బోర్ కొట్టించిన ఘనత ఎన్.శంకర్ కే చెందుతుంది. దర్శకుడిగా ఎన్.శంకర్ నేటి తరహా సినిమాలతో అప్డేట్ అయినా అవ్వాలి లేదంటే కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మీడియం బడ్జెట్ సినిమాలను ప్రొడ్యూస్ అయినా చేయాలి కానీ.. కేవలం దర్శకుడిగా తన ఉనికిని చాటుకోవడం కోసం ఇలాంటి సినిమాలు తీసి ఆయన ట్రాక్ రికార్డ్ ను పాడుచేసుకోకుండా ఉంటే మంచిది.

విశ్లేషణ : రెండున్నర గంటల బోర్ డమ్ ను తట్టుకొని థియేటర్ లో కూర్చునే ఓపిక ఉంటే మాత్రమే థియేటర్ లో చూడదగిన చిత్రం “2 కంట్రీస్”.

రేటింగ్ : 1/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus