హీరోలు, డైరెక్టర్లకు ఉత్సాహాన్నిచ్చిన 2017

ఎన్ని విజయాలను చూసిన వారికైనా ఒక్క అపజయం వస్తే చాలు.. వెనక్కి వెళ్ళిపోతారు. సినీ పరిశ్రమలో అయితే పలకరించేవారు కూడా తగ్గిపోతారు. హిట్ కొట్టకపోతే కనుమరుగు అయిపోవడం ఖాయం. ఆ గండం నుంచి ఈ ఏడాది కొంతమంది హీరోలు, డైరక్టర్లు తప్పించుకున్నారు. హిట్ అందుకొని మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. అటువంటి వారిపై ఫోకస్..

ఖైదీ నంబర్ 150 (చిరంజీవి ) “నన్ను ఇప్పుడు ఆదరిస్తారా?”.. అనే ప్రశ్న మెగాస్టార్ చిరంజీవిని ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చేశాయి. తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడాన్ని, తొలి చిత్రంలా భావించి ఆయన కష్టపడ్డారు. ప్రయోగాల జోలికి పోకుండా హిట్ అయిన కథతో ఖైదీ నంబర్ 150 అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ఒక వారంలో వంద కోట్ల గ్రాస్, రెండో వారానికి వంద కోట్ల షేర్ ని వసూల్ చేసి మెగా స్టార్ సత్తాన్ని చాటింది.

రారండోయ్ వేడుక చూద్దాం (నాగ చైతన్య ) యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున నిర్మించిన ఈ మూవీతో చైతూ మంచి పేరు తెచ్చుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ అందమైన మూవీ భారీ కలక్షన్స్ వసూలు చేసింది

గౌతమి పుత్ర శాతకర్ణి (బాలకృష్ణ) లయన్, డిక్టేటర్ వంటి అపజయాలతో రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్న బాలకృష్ణకి గౌతమి పుత్ర శాతకర్ణి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో బాలకృష్ణ మళ్ళీ మీసం తిప్పారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో చక చక సినిమాలు చేస్తున్నారు.

గరుడ వేగ (రాజశేఖర్) ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 125.18” సూపర్ హిట్ గా నిలిచింది. రెండేళ్ల తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ థియేటర్లోకి వచ్చినప్పటికీ ఆదరణ తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 230 థియేటర్స్ లో రిలీజై తొలి రోజు రోజు 2.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాజశేఖర్ కి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది.

రాజా ది గ్రేట్ (రవితేజ) మాస్ మహారాజ్ రవితేజ రెండేళ్ల గ్యాప్ తో వచ్చినప్పటికీ వెండితెరపై అతని జోష్ పెరిగిందే తప్ప తగ్గలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ అంధుడిగా నటించిన “రాజా ది గ్రేట్” చూసిన తర్వాత అందరూ రవితేజ ది గ్రేట్ అన్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ రవితేజకి కంబ్యాక్ మూవీగా నిలిచింది.

ఫిదా (శేఖర్ కమ్ముల) మంచి కాఫీలాంటి చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ములకి పదేళ్లుగా మంచి హిట్ లేదు. హ్యాపీడేస్ తర్వాత అతను చేసిన ఆవకాయ్ బిర్యానీ, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, అనామిక.. అన్ని ప్లాప్ అయ్యాయి. ఈ ఏడాది వరుణ్, సాయి పల్లవితో చేసిన ఫిదా 60 కోట్లు వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.

మళ్ళీరావా (సుమంత్) అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్ కి సత్యం సినిమా తర్వాత చెప్పుకోదగ్గ విజయం లేదు. అయినా నిరాశ పడకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ ఏడాది అతనికి మళ్ళీరావా మూవీ ఊపిరినిచ్చింది. గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సుమంత్ కి సూపర్ కంబ్యాక్ మూవీగా నిలిచింది.

తేజ (నేనే రాజు నేనే మంత్రి) జయం సినిమా తర్వాత తేజకి విజయమే లేకుండా పోయింది. దాదాపు పదిహేనుళ్లుగా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. చివరికి రానా తోను నేనే రాజు నేనే మంత్రి అని ప్రయోగం చేశారు. హీరోకి నెగిటివ్ క్లైమాక్స్ ఇచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. డైరక్టర్ గా పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు.

ఫిదా (వరుణ్ తేజ్ ) లోఫర్, మిస్టర్ సినిమాల అపజయాలతో నిరాశలో ఉన్న వరుణ్ తేజ్ కి ఫిదా మంచి ఉత్సాహాన్నిచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూడు రోజుల్లోనే 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి వరుణ్ తేజ్ రేంజ్ పెంచింది.

వివి వినాయక్ (ఖైదీ నంబర్ 150) మంచి హిట్స్ ఇచ్చిన వివి వినాయక్ కి అఖిల్ సినిమా ఉన్న పేరును మొత్తం లాక్కెళ్ళింది. ఇక వినాయక్ దగ్గర స్టాఫ్ అయిపోయిందని టాక్ మొదలైంది. ఆ చెడ్డ పేరును ఖైదీ నంబర్ 150 సినిమాతో చెరిపేసుకున్నారు. రీమేక్ అయినప్పటికీ నేటివిటీకి తగ్గట్టు మార్చి మెప్పించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus