2018లో కేరళ భారీ వరదల నేపధ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం “2018”. టోవినో థామస్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ వంటి టాప్ హీరోలందరూ కలిసి నటించిన ఈ చిత్రం మే 5న మలయాళంలో విడుదల అఖండ విజయాని సొంతం చేసుకొంది. మలయాళంలో 100 కోట్ల కలెక్షన్ సాధించిన రెండో చిత్రంగా చరిత్ర సృష్టించింది. అందుకే ఈ చిత్రరాజాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి గీతా ఆర్ట్స్ ముందుకొచ్చింది. అనువాద రూపంలో అదే పేరుతో ఇవాళ విడుదల చేసింది. ఈ సినిమాని కచ్చితంగా ఎందుకు చూడాలో చదివి తెలుసుకోండి.
కథ: ఇడుక్కి డ్యామ్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా పొంగిన వరద నీరు కారణంగా కేరళలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటి ఉధృతతో చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఆ క్రమంలో.. ఊరి ప్రజలు తమను తాము ఎలా రక్షించుకున్నారు? ప్రభుత్వం ఎలా సహకరించింది? అనేది “2018” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: ప్రతి ఒక్క నటుడూ సినిమాలోని పాత్రలో ఎంతలా ఒదిగిపోయాడంటే.. తెర మీద నటుల్ని కాక, ఊర్లోని కొంతమంది జనాల్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. గవర్నమెంట్ అధికారిగా కుంచకో బోబన్, మోడల్ గా ఆసిఫ్ అలీ, ఆర్మీ నుంచి పారిపోయి వచ్చి.. దుబాయ్ లో ఉద్యోగం కోసం తపించే యువకుడిగా టోవినో థామస్, జాలరిగా లాల్ ఇలా ప్రతి ఒక్కరూ పాత్రల్లో జీవించేశారు.
ఒకరి పాత్ర హైలైట్ మరొకరిది ఎలివేట్ అవ్వలేదు అని చెప్పడానికి లేదు. నెగిటివ్ రోల్స్ చేసిన ఆర్టిస్టులు ఎంతలా ఎలివేట్ అయ్యారో.. పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన నటులు కూడా అదే స్థాయిలో ఎలివేట్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ప్రొడక్షన్ డిజైన్ & గ్రాఫిక్స్ టీం గురించి మాట్లాడుకోవాలి. 2018 వరదలను అచ్చుగుద్దినట్లుగా రీక్రియేట్ చేశారు. అసలు క్లైమాక్స్ 20 నిమిషాలు ఎలా షూట్ చేశారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో లేవనెత్తడం ఖాయం. వరదల్లో జనాలు బోట్ల మీద ప్రయాణించే సన్నివేశాలు ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే.. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన అవుట్ పుట్ ఎలా అందించాలి అనే సబ్జెక్ట్ మీద “2018” చిత్రాన్ని ఒక మాస్టర్ క్లాస్ గా ప్రెజంట్ చేయొచ్చు. అఖిల్ జార్జ్ ఛాయాగ్రహణం, నోబిల్ పాల్ సంగీతం సినిమాకి ఆయువుపట్టు లాంటివి. ఈ ఇద్దరూ కలిసి చేసిన మ్యాజిక్ కి ప్రేక్షకుల హృదయాలు బరువెక్కుతాయి.
దర్శకుడు జ్యూడ్ ఆంటోనీ జోసెఫ్ ఒక సాధారణ కథను, అసాధారణమైన స్క్రీన్ ప్లే & ఎమోషన్స్ తో నడిపించిన విధానం అభినందనీయం. మరీ ముఖ్యంగా 2018 వరదల కారణంగా జరిగిన చెడు కంటే.. మంచిని ఎలివేట్ చేస్తూ, కేవలం పాజిటివ్ యాంగిల్ లోనే సినిమాను ఎక్కువగా నడిపిన తీరు బాగుంది. ఈ కారణంగా కొన్ని కీలకమైన అంశాలను గాలికొదిలేయాల్సి వచ్చినా.. సినిమాలో ఎమోషన్ ఆ మైనస్ ను తెలియనివ్వలేదు.
విశ్లేషణ: సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల నేపధ్యంగా వచ్చే సినిమాలన్నీ కుదిరితే మరీ ఎక్కువగా భయపెట్టేస్తాయి, లేదా అనవసరమైన హీరో ఎలివేషన్స్ తో చిరాకు పెట్టిస్తాయి. కానీ.. ఆ రెంటికీ దూరంగా కేవలం మనిషిలోని మానవీయ కోణాన్ని ఎలివేట్ చేస్తూ కుదిరినంత పాజిటివిటీని మాత్రమే చూపిస్తూ తెరకెక్కిన “2018” కచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రం.
మలయాళంలో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం ఖాయం. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం సగటు ప్రేక్షకులు, ఒక నేచురల్ డిజాస్టర్ ను ఎలా తెరకెక్కించొచ్చు అనే విషయాన్ని నేర్చుకోవడం నవతరం ఫిలిమ్స్ మేకర్స్ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాల్సిందే!
రేటింగ్: 3.5/5