ఏ సినిమాకి అయినా రైటింగ్ చాలా ముఖ్యం. స్క్రిప్ట్ దశలో ప్రాపర్ గా వర్క్ చేస్తేనే సెట్స్ పైకి వెళ్ళాక ఇబ్బందులు లేకుండా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. లేదు అంటే నిత్యం ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. పెద్ద సినిమాలకు రైటర్స్ వర్క్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ కథ ఏంటి? దాని స్టైల్ ఏంటి? హీరోకి ఎలాంటి ఇమేజ్ ఉంది.?
ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని సరైన రైటర్స్ ను పెట్టుకుని కథని, కథనాన్ని డెవలప్ చేసుకోవాలి. లేదు అంటే ఫలితాలు తేడా కొట్టేస్తాయి. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. అయితే అందులో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా కూడా ఒకటని చెప్పాలి. సరైన రైటర్ లేకపోవడం వల్ల ఈ సినిమాకి అన్యాయం జరిగిందని స్వయంగా దర్శకుడు వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ” ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా విషయంలో నేను చేసిన పొరపాటు ఏంటంటే.. ఈ సినిమాకి రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని పెట్టుకోవడం.సాధారణంగా ఇలాంటి మాస్ సినిమాలకు ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ గారు కరెక్ట్. ఈ విషయం నాకు అప్పట్లో తెలీదు. పైగా గోపాలకృష్ణ గారితో ఆ టైంకి నాకు పరిచయం కూడా లేదు. కానీ వెంకటేశ్వరరావు గారు నాకు బాగా క్లోజ్.
అందుకే ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాకి ఆయన్ని రైటర్ గా పెట్టుకున్నాను. ‘చెన్నకేశవరెడ్డి’ అనేది పూర్తిగా గోపాలకృష్ణ గారి బ్రాండ్ మూవీ. నేను ‘చెన్నకేశవరెడ్డి’ విషయంలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. తర్వాత నేను చేసిన మరో తప్పు.. బాలకృష్ణ గారితో డబుల్ రోల్ చేయిస్తున్నప్పుడు పెద్ద బాలకృష్ణ గారి రోల్ పై మాత్రమే ఫోకస్ పెట్టాను. ఆయన్ని ఎంత మాస్ గా చూపించాలి అనే విషయంపైనే వర్క్ చేశాను.
కానీ చిన్న బాలకృష్ణ గారి రోల్ పై సరిగ్గా దృష్టి పెట్టలేదు. ఆ పాత్ర వల్ల సినిమాకి ఉన్న స్ట్రెంత్ అంతా తగ్గిపోయినట్టు అయ్యింది” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.