పాపులర్ యాంకర్ ప్రదీప్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. “నీలి నీలి ఆకాశం” పాట పుణ్యమా అని సినిమాకి వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్ డౌన్ కారణంగా విడుదలైన పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? హీరోగా ప్రదీప్ కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడింది? అనేది చూద్దాం..!!
కథ: బ్రిటీష్ కాలంలో ప్రేమించుకొని.. పెళ్లి చేసుకొందాం అని ఒకరికొకరు మాట ఇచ్చుకొని, కారణాంతరాల వలన కలుసుకోకుండానే కళ్ళు మూస్తారు అర్జున్ (ప్రదీప్), అక్షర (అమృత అయ్యర్). మళ్ళీ 2020లో ఒకే కాలేజ్ లో కలుసుకొంటారు. కానీ.. గత జన్మలో ఘాటు ప్రేమికులు కాస్తా బద్ధ శత్రువుల్లా ప్రవర్తిస్తుంటారు. మరి ఈ జంట మళ్ళీ కలిసిందా? చివరికి ఏం జరిగింది? అనేది “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: నటుడిగా ప్రదీప్ 100 మార్కులు సంపాదించుకున్నాడు. కాలేజ్ స్టూడెంట్ రోల్లో రెగ్యులర్ గా కనిపించినా.. మొదటి పది నిమిషాల్లో స్వచ్చమైన ప్రేమికుడిగా చక్కని నటన కనబరిచాడు. హీరోగా ప్రదీప్ కి మంచి డెబ్యుగా ఈ సినిమాని నిలుస్తుంది. అమృత అయ్యర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. శుభలేఖ సుధాకర్, మహేశ్, వైవా హర్ష, పోసాని కృష్ణమురళిలు ఆడియన్స్ ను అలరించారు. ఓవరాల్ గా నటీనతులండరు సినిమాకి న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. నేపద్య సంగీతం కూడా బాగుంది. శివేంద్ర సినిమాటోగ్రఫీ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చింది. మాటలు, పాటలు కూడా బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. దర్శకుడు మున్నా ఎంచుకున్న గత జన్మల కాన్సెప్ట్ బాగుంది. అయితే.. స్క్రీన్ ప్లే ఇంకాస్త పకద్భందీగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మధ్యలో ఆత్మలు మారిపోవడం కాన్సెప్ట్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేయడం వల్ల కొత్తగా అనిపించదు. పైగా.. సెకండాఫ్ కామెడీ కాస్త విసుగు పుట్టిస్తుంది. ఎండింగ్ బాగున్నప్పటికీ.. ఏదో అసంతృప్తి. సొ, దర్శకుడిగా-కథకుడిగా మున్నా ఓ మోస్తరు మార్కులతో నెట్టుకొచ్చాడు.
విశ్లేషణ: ప్రదీప్ కి రీజనల్ ఆడియన్స్ లో మంచి రీచ్ & అప్రోచ్ ఉంది. దాన్ని చక్కగా క్యాష్ చేసుకున్న సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. కథనం పరంగా ఇంకాస్త హోమ్ వర్క్ చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. ప్రదీప్ కోసం, అనూప్ సంగీతం కోసం ఒకసారి చూడదగిన చిత్రమిది. ఎలాగూ భారీ అంచనాలుండవు కాబట్టి.. ఎక్కువగా ఇబ్బందిపడే అవకాశం కూడా ఉండదు. ప్రదీప్ వీరాభిమానులు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.
రేటింగ్: 2.5/5