నవరస నటనా వారసుడు నాగ్ మన యువ సామ్రాట్

  • August 29, 2016 / 06:27 AM IST

అక్కినేని నాగేశ్వరరావు అభిమానుల ఆశలను అనుగుణంగా నాగార్జున తన తండ్రి పోషించిన ప్రేమికుడు, భక్తుడి పాత్రలతో రాణించి క్లాస్ ప్రేక్షకుల్లో, మహిళల్లో అభిమానులను సంపాదించుకున్నారు. యాక్షన్ హీరోగానూ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినీ జీవితంలో 30 ఏళ్లు పూర్తిచేసుకున్న నాగ్ వందో చిత్రానికి అతి చేరువలో ఉన్నారు. నేడు (ఆగస్టు 29) పుట్టినరోజు జరుపుకుంటున్న కింగ్ నాగార్జునకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఆయన టాప్ టెన్ చిత్రాల గురించి…

1. గీతాంజలి (1989)

అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా నాగార్జున చిత్రపరిశ్రమకు వచ్చిన తొలి నాళ్లలోనే నిరూపించుకున్నారు. విషాదాంత ఇతివృత్తంతో మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి మూవీ దేవదాసుని గుర్తుచేసింది. ఇందులోని డైలాగులు అప్పటి యువతను కట్టిపడేసింది. నాగ్ సహజమైన నటనతో అమ్మాయిల మనసు దోచుకున్నారు.

2. శివ (1989)తెలుగు సినిమా గతిని మలుపు తిప్పిన సినిమా శివ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జునను చూపించిన విధానం కుర్రకారుకి బాగా నచ్చింది. ఈ చిత్రంతో యాక్షన్ హీరోగా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. శివ అనే పేరు వినగానే సైకిల్ చైన్ పట్టుకున్న నాగ్ స్టైల్ అందరీ కళ్ళముందు కదలాడుతుంది. అంతగా ప్రభావితం చేసింది ఈ సినిమా.

3. హలో బ్రదర్ (1994)నాగార్జునలోని కామెడీ యాంగిల్ ని బయట పెట్టిన చిత్రం హలో బ్రదర్. ఇందులో క్లాస్, మాస్ హీరోలుగా నాగ్ నవ్వుల వాన కురిపించారు. హాలీవుడ్ మూవీ ట్విన్ డ్రాగన్ చిత్రం ఆధారంగా ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.

4. నిన్నే పెళ్లాడుతా (1996)నాగార్జునను ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరి చేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. ఇందులో లవర్ బాయ్ గా కనిపిస్తూ, కుటుంబ సభ్యులతో గ్రీకువీరుడు చేసిన సందడి అందరికీ నచ్చింది. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను చక్కగా చూపించి నాగ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.

5. అన్నమయ్య (1997)ఎన్నో కమర్షియల్ హిట్ చిత్రాలు ఇచ్చిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, గ్రీకువీరుడిగా పేరుతెచ్చుకున్న నాగార్జున కలిసి చేసిన చిత్రం అన్నమయ్య. చిత్రం ప్రకటన చేసినప్పటి నుంచి విమర్శలను ఎదుర్కొన్న ఈ సినిమా అపూర్వ విజయం సాధించింది. నాగ్ భక్తుడిగా తన నటనతో విమర్శకుల నోళ్లను మూయించారు.

6. సంతోషం (2002)స్టార్ హీరో స్థాయికి వచ్చినప్పుడు అభిమానుల అంచనాలకు తగినట్లు సినిమాను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ప్రయోగాలకు ముందు ఉండే నాగార్జున స్టార్ హోదాను ఆలోచించకుండా.. కథే హీరో అనుకోని చేసిన సినిమా సంతోషం. ఫైట్లు బిల్డప్ లు లేకుండా ఎంతో సాఫ్ట్ గా సాగిపోతూ మహిళా ప్రేక్షకుల జేజేలు అందుకుంది.

7. మన్మధుడు (2002)సంతోషం ఇచ్చిన ఉత్సాహంతో కామెడీ డోస్ పెంచి ప్రేమ కథను మేళవించి త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయ్ భాస్కర్ లు నాగార్జునకు ఇచ్చిన ట్రీట్ మన్మధుడు. టాలీవుడ్ మన్మధుడు నాగార్జునే అంటూ తెలుగు ప్రజలు ఈ మూవీని సూపర్ హిట్ చేశారు. ఎన్ని సార్లు చుసిన ఈ చిత్రం బోర్ కొట్టదు.

8. మాస్ (2004)శివ సినిమా తర్వాత నేటి తరానికి నచ్చే యాక్షన్ తో నాగ్ చేసిన సినిమా మాస్. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ డైరక్టర్ గా ఈ చిత్రం తో పరిచయమయ్యారు. నాగార్జున చాలా కాలం తర్వాత ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ తో మాస్ లో మెప్పించారు. అన్న నడిచొస్తే మాస్ అనే పాట ఆ ఏడాదంతా మారుమోగింది.

9. మనం (2014)కథను ఎంపిక చేసుకోవడంలో నాగార్జున అభిరుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదని చాటిన చిత్రం మనం. అక్కినేని కుటుంబానికి సరిపోయే స్టోరీని ఎంపిక చేసుకుని తండ్రి ఏఎన్ఆర్, కొడుకు నాగ చైతన్యతో కలిసి నటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీనిని అక్కినేని అభిమానులు మరిచిపోని విధంగా దర్శకుడు విక్రమ్ కుమార్ మలిచారు.

10. ఊపిరి (2016)కేవలం చక్రాల కుర్చీలో కూర్చొనే నాగార్జున నవరసాలు పండించి సినిమాకు ఊపిరి పోశారు. యువ నటుడు కార్తీ తో స్క్రీన్ ని పంచుకొని మరో మరుపురాని చిత్రాన్ని తన ఖాతాల్లో వేసుకున్నారు. స్టార్ హీరో అంటే ఒకే చట్రంలో ఇరుక్కోకూడదని “ఊపిరి” ద్వారా నాగ్ యువ కథానాయకులకు చాటి చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus