ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 5, 2021 / 03:26 PM IST

తమిళంలో మచి విజయం సాధించిన “నప్టే తునై” రీమేక్ గా తెరకెక్కిన చిత్రం “ఏ1 ఎక్స్ ప్రెస్”. సందీప్ కిషన్ 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం హాకీ నేపద్యంలో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. మరి ఈ స్పొర్ట్స్ డ్రామా ఆడియన్స్ ను అలరించిందా? సందీప్ కిషన్ కు హిట్ దొరికిందా? అనేది సమీక్షలో చూద్దాం..!!

కథ: సందీప్ నాయుడు (సందీప్ కిషన్) సరదాగా తన మావయ్య ఊరు యానాం వస్తాడు. అక్కడ లావణ్య (లావణ్య త్రిపాఠి)ని తొలుత ఫోటోలో తర్వాత డైరెక్ట్ గా చూసి ఇష్టపడతాడు. డిస్ట్రిక్ట్ లెవల్ హాకీ ప్లేయర్ అయిన లావణ్య మరియు అకాడమీ కోచ్ (మురళీ శర్మ)లు తమ గ్రౌండ్ ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు తెలుస్తుంది సందీప్ నాయుడు అందరూ అనుకుంటున్నట్లు ఆకతాయి కాదని, ఇంటర్నేషనల్ లెవల్ ప్లేయర్ మరియు అండర్ 21 ఇండియన్ టీం కెప్టెన్ అని తెలుసుకొంటారు. వీళ్ళందరూ కలిసి తమ గ్రౌండ్ ను ఫారిన్ కంపెనీకి అమ్మేయాలని మాస్టర్ ప్లాన్ వేసిన స్పొర్ట్స్ మినిస్టర్ రావు రమేశ్ (రావు రమేశ్)ను ఎలా ఎదుర్కొన్నారు? అనేది “ఏ1 ఎక్స్ ప్రెస్” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా సందీప్ లో పరిణితి కనిపించింది. చాన్నాళ్ల తర్వాత సబ్టల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకి, క్యారెక్టర్ కి ఎంతవరకు అవసరమే అంతే ఎమోషన్ ను పండించాడు. ఫిజికల్ గా, ఆటిట్యూడ్ పరంగా, మ్యానరిజమ్స్ పరంగా ఒక పర్ఫెక్ట్ హాకీ ప్లేయర్ లా కనిపించాడు సందీప్. “ప్రస్థానం” తర్వాత సందీప్ ఎమోషనల్ సీన్ లో చక్కగా నటించిన సినిమా ఇదే అనొచ్చు.

లావణ్య త్రిపాఠి పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతలో అలరించింది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్ కావడంతో ఆమెకు పెద్దగా నటించడానికి స్కోప్ కూడా లేదు. రావు రమేశ్ కి చాన్నాళ్ల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరికింది. పోసాని, మురళీ శర్మ, సత్య, మహేశ్ విట్టా, భూపాల్, అభిజిత్ లు తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. మహర్షి ఫేమ్ తాతకు మళ్ళీ మంచి పాత్ర దొరికింది.

సాంకేతికవర్గం పనితీరు: కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. ఒక స్పొర్ట్స్ డ్రామా ఫీల్ ను తన కెమెరా ఫ్రెమింగ్స్ తో తీసుకొచ్చాడు కెవిన్. ఇక హిప్ హాప్ తమిళ మ్యూజిక్ & బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ముఖ్యంగా ప్రీఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే “సీటు సిరగదా” అని మంగ్లీ-ప్రణవ్ చాగంటి పాడిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఛోటా కె.ప్రసాద్ ఎక్స్ పీరియన్స్ & షార్ప్ ఎడిటింగ్ స్కిల్ సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేకుండా చేసింది.

దర్శకుడు డెన్నిస్ తమిళ రీమేక్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఒరిజినల్ వెర్షన్ లో భారీ మార్పులు చేయకుండా తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్ లో ఎమోషన్ ను ఒరిజినల్ స్థాయిలో పండించలేకపోయాడు కానీ.. మిగతా అంతా బాగా కంపోజ్ చేసుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లేస్ మెంట్, సాంగ్స్ ను డిఫరెంట్ గా పిక్చరైజ్ చేయించుకున్నాడు. ఒక ఇంటర్నేషనల్ లెవల్ ప్లేయర్ గురించి ఎక్స్ మిలటరీ అయిన కోచ్ కి తెలియకుండా ఎలా ఉందా అనే విషయం తప్పితే.. పెద్దగా లాజిక్స్ కూడా మిస్ అవ్వలేదు. అన్నిటికంటే ముఖ్యంగా మొదటి నుంచి ఒక ఎమోషన్ ను బాగా మైంటైన్ చేశాడు. లవ్, ఫ్రెండ్ షిప్, రివెంజ్ లాంటి ఎమోషన్స్ ను డీల్ చేసిన విధానం బాగుంది. క్లైమాక్స్ ఇంకాస్త పక్కాగా డీల్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా డైరెక్టర్ గా డెన్నిస్, సినిమాటోగ్రాఫర్ గా కెవిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు.

విశ్లేషణ: చిన్నపాటి లాజికల్ మిస్టేక్స్, క్లైమాక్స్ లో మిస్ అయిన ఎమోషన్ ను పక్కన పెడితే “ఏ1 ఎక్స్ ప్రెస్” ఒక మంచి టైమ్ పాస్ ఎంటర్ టైనర్. చాన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సందీప్ ను ఎట్టకేలకు విజయ లక్ష్మి వరించింది. ఈవారం చెప్పుకోదగ్గ సినిమా కూడా ఇదొక్కటే కాబట్టి కమర్షియల్ హిట్ అవ్వడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. సొ, ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో ఎంజాయ్ చేయదగిన ఈ చిత్రాన్ని హ్యాపీగా చూసేయొచ్చు.

రేటింగ్: 3/5

Click Here To Read In English

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus