ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకోవడం కోసం ఇబ్బందిపడుతున్న కథానాయకుడు అల్లరి నరేష్(Allari Naresh) . మధ్యలో పంధా మార్చి నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసినప్పటికీ.. అవి సరిగ్గా వర్కవుటవ్వక మళ్ళీ తన మార్క్ కామెడీ జోన్ లోకి వచ్చేశాడు. అలా చేసిన ప్రయత్నమే “ఆ ఒక్కటీ అడక్కు” (Aa Okkati Adakku). మరి ఈ ప్రయత్నం ఏమేరకు ఫలించిందో చూద్దాం..!!
కథ: సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఉద్యోగం, వైజాగ్ లో సొంత ఇల్లు. పైసా అప్పు లేని జీవితం. ఇలా అన్నీ ఉన్నా 30 ఏళ్ళు దాటడం, తనకంటే ముందు తమ్ముడికి పెళ్లై, పాప కూడా ఉండడంతో గణపతి (అల్లరి నరేష్)కి సంబంధాలు దొరక్క ఇబ్బందిపడుతుంటాడు. ఏకంగా 50 సంబంధాలు క్యాన్సిల్ అయ్యాక హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం ప్యాక్ తీసుకొని మొదట సిద్ధి (ఫరియా)ను (Faria Abdullah) కలుస్తాడు. ఇంకా 9 ఆప్షన్లు ఉన్నప్పటికీ..
సిద్ధికే ఫిక్స్ అవుతాడు. కానీ.. సిద్ధి మాత్రం నో చెప్పేసి సైలెంట్ గా వెళ్లిపోతుంది. చివరికి గణపతికి సంబంధం సెట్ అయ్యిందా? గణపతి జీవితంలోకి సిద్ధి రావడం వల్ల జరిగిన నష్టం ఏమిటి? అనేది తెలియాలంటే “ఆ ఒక్కటీ అడక్కు” చూడాలన్నమాట.
నటీనటుల పనితీరు: నరేష్ తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్ లోకి రీఎంట్రీ ఇవ్వడం సంతోషం. కానీ.. ఈ సినిమాలో అతడి కామెడీ టైమింగ్ ను పూర్తిగా స్థాయిలో వాడుకోలేదు దర్శకుడు. అందువల్ల వింటేజ్ నరేష్ కామెడీ పంచులు మిస్ అయ్యాయి. అయితే.. నటుడిగా మాత్రం నరేష్ తన పాత్రకు న్యాయం చేశాడు. నరేష్ తర్వాత సినిమాలో ఆకట్టుకున్న నటి జామీ లివర్. బాలీవుడ్లో స్థిరపడిన మన తెలుగువాడైన జానీ లివర్ (Johnny Lever) కుమార్తె అయిన జామీ ఈ చిత్రంలో తన డైలాగ్ డెలివరీ & హావభావాలతో నవ్వించింది.
మంచి పాత్రలు పడితే.. యంగ్ వెర్షన్ ఆఫ్ కోవై సరళ తరహాలో సెటిల్ అయిపోతుందీవిడ. వెన్నల కిషోర్ (Vennela Kishore) కనిపించేది కొద్దిసేపే అయినా చక్కగా నవ్వించాడు. ముఖ్యంగా చికెన్ ఎపిసోడ్ బాగా వర్కవుటయ్యింది. ఫరియాలో మంచి ఎనర్జీ ఉంటుంది. కానీ.. ఈ సినిమాలో ఆమెను డల్ గా చూపించడం మైనస్ అయ్యింది. అలాగే.. ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్ ను కూడా సరిగా వినియోగించుకోలేదు. రవికృష్ణ, అరియానా (Ariyana Glory) , వైవా హర్ష (Harsha Chemudu) తదితరులు తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు మల్లి అంకం ఎంచుకున్న మూలకథలో యూత్ & పెళ్లి కోసం తిప్పలు పడుతున్న మిడిల్ క్లాస్ బ్యాచిలర్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. ఆ మూలకథను అనవసరమైన ట్విస్టుల కోసం కిచిడీ చేసేయడం మైనస్ అయ్యింది. అలాగే.. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండే సన్నివేశం ఒక్కటీ లేదు. అలాగే.. దర్శకుడిగా సీన్ కంపోజిషన్స్ & డైలాగ్స్ విషయంలో కూడా మల్లి అంకం నవ్యత చూపలేకపోయాడు. మంచి బడ్జెట్ & ప్రొడక్షన్ డిజైన్ ఉన్నా.. వాటిని సరిగా వినియోగించుకోలేక చతికిలపడ్డాడు మల్లి.
గోపీసుందర్ (Gopi Sundar) సంగీతం బాగున్నా.. సదరు పాటల ప్లేస్మెంట్ & కొరియోగ్రఫీ బాలేవు. అందువల్ల వినసోంపుగా ఉన్న పాటలు చూడ్డానికి మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయి. “రాజాధి రాజా” పాట ఒక్కటే చూడబుద్దైంది. అందుకు అల్లరి నరేష్ & హరితేజ (Hari Teja) కాంబినేషన్ కారణం.
విశ్లేషణ: “ఆ ఒక్కటీ అడక్కు” అనే క్లాసిక్ టైటిల్ పెట్టుకున్నందున కచ్చితంగా సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. అందులోనూ అల్లరి ఈజ్ బ్యాక్ అని ప్రమోట్ చేసిన తీరుకు కామెడీ సినిమా ప్రేక్షకులు వెయిట్ చేసిన సినిమా ఇది. అయితే.. కామెడీ అక్కడక్కడా మాత్రమే వర్కవుటవ్వడం, అనవసరమైన ట్రాక్ లు మెయిన్ స్టోరీని డైవర్ట్ చేయడం కారణంగా “ఆ ఒక్కటీ అడక్కు” ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది.
ఫోకస్ పాయింట్: అల్లరి నరేషూ.. ఎంటర్టైన్మెంట్ లేకుండా ఆ ఒక్కటీ (హిట్) అడక్కయ్యా!
రేటింగ్: 2/5