ప్రముఖ సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘తాయ్ కిళవి’. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 27న విడుదలైంది. సగటు సినిమాలకు పూర్తి దూరంగా ప్రయోగాత్మక లుక్‌లో రాధిక నటించిన సినిమా ఇది. రాధిక లుక్ ఈ సినిమా ప్రత్యేకంగా మారింది, అదే ఇప్పుడు సినిమాకు వసూళ్లను అందిస్తోంది. అంతటి లుక్ కోసం ఆమె పడిన శ్రమ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. దీంతో ఈ వయసులో ఇంత కష్టపడ్డారా.. గ్రేట్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
‘తాయ్ కిళవి’ సినిమాలో వయసుకు మించిన పాత్రలో కనిపించారు రాధిక. ప్రచార చిత్రాల్లో ఆమె మేకప్ మీరు చూసుంటారు కూడా. దాని కోసం ఆమె రోజుకు ఏడు గంటలు కష్టపడేవారట. అంటే మేకప్ వేయడానికి ఐదు గంటలు పడితే.. దాన్ని తొలగించడానికి రెండు గంటల సమయం పట్టేదట. ఈ విషయాన్ని రాధికనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె కష్టానికి తమిళంలో మంచి స్పందనే వస్తోంది. మరి ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారేమో చూడాలి..
అయితే ఈ సినిమాను దర్శకుడు తొలుత రజనీకాంత్‌ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారట. ఇలాంటి క్యారెక్టరులో ఆయన నటించే అవకాశం లేకపోవడంతో ఆ క్యారెక్టర్‌ను మహిళగా మార్చి తన దగ్గరకు తీసుకొచ్చారని రాధిక గతంలో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తనకు కమల్ హాసన్ ప్రేరణ అని తెలిపారు. తెరపై ఎప్పుడూ కథా పాత్ర మాత్రమే కనిపించాలని కమల్ ఎప్పుడూ చెబుతుంటారని, ఆ మాటను మనసులో పదిలంగా దాచుకుని దానికి తగ్గట్టుగా కష్టపడి పని చేస్తున్నానని రాధిక తెలిపారు. అన్నట్లు ఈ సినిమా నిర్మాతల్లో ప్రముఖ తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్ కూడా ఉన్నారు. సుధాన్ సుందరంతో కలసి ఆయన ఈ సినిమాను నిర్మించారు.