Aadavallu Meeku Johaarlu Review: ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 4, 2022 / 03:53 PM IST

శర్వానంద్-రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించిన చిత్రం “ఆడవాళ్ళు మీకు జోహార్లు”. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మార్చి 4) విడుదలైంది. సినిమా పాటలు, ట్రైలర్ ఆశించిన స్థాయి ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. మరి సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: చిరు (శర్వానంద్) ఓ జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన కుర్రాడు. ఒక్కడే అబ్బాయి అవ్వడంతో ఇంట్లో ఆడాళ్ళందరూ చిరును ఎంతో గారాబంగా పెంచుతారు. ఒక స్టేజ్ కి వచ్చేసరికి ఆ గారాబం కాస్త అతి ప్రేమ, అతి జాగ్రత్తగా మారుతుంది. ఈ క్రమంలో చిరు తొలిచూపులోనే ఆధ్య (రష్మిక మందన్న)ను ప్రేమిస్తాడు.

అసలే చిరు పెళ్లాడడం కోసం ఇంట్లో ఉన్న ఆడాళ్లందరినీ ఒప్పించడానికి నానా ఇబ్బందులు పడుతుంటే.. ఆధ్య తల్లి రూపంలో మరో సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యల నుంచి చిరు ఎలా బయటపడ్డాడు? అనేది “ఆడవాళ్ళు మీకు జోహార్లు” కథాంశం.

నటీనటుల పనితీరు: హీరోహీరోయిన్లను పక్కన పెడితే.. రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ ఆర్టిస్టులను ఒకే స్క్రీన్ పై చూడడం ఒక చక్కని ఎక్స్ పీరియన్స్. వాళ్ళు నటించిన కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. శర్వానంద్ తన కెరీర్ లో అత్యంత పేలవమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇదే. రష్మిక లుక్స్ కూడా సినిమాలో బాలేవు. హీరోహీరోయిన్ల లుక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కిషోర్ తిరుమల రాసుకున్న కథ ఎప్పుడో 80ల కాలంలోనే ఒకటికి పదిసార్లు చూసేశారు మన తెలుగు ప్రేక్షకులు. అలాంటి సీరియల్ స్టోరీని 2022 కాలంలో సినిమాగా తీయడమే పెద్ద సాహసం అనుకుంటే.. స్క్రీన్ ప్లేను మరీ స్లోగా సాగదీయడం, సన్నివేశాల కంపోజిషన్ ఆల్రెడీ చూసేసిన ఒక పది సినిమాలను గుర్తు చేయడం అనేది దర్శకుడిగా కిషోర్ తిరుమల ఎంత పేలవంగా సినిమాను రాసుకొని, తీశాడో అర్ధం చేసుకోవచ్చు. కిషోర్ తిరుమల వీకెస్ట్ ఫిలింగా ఈ చిత్రం నిలిచిపోతుంది.

దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సోసోగా ఉండగా.. నేపధ్య సంగీతం విషయంలో జీబ్రాన్ తరహాలో చేసిన ప్రయోగం దారుణంగా బెడిసికొట్టిందని చెప్పాలి. ఒక్కోసారి సన్నివేశం కంటే.. నేపధ్య సంగీతం ఎక్కువ చిరాకుపెట్టింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ సోసోగా ఉన్నాయి. బేసిగ్గా సినిమాలో విషయం లేకపోవడంతో టెక్నికల్ అంశాలన్నీ చాలా వీక్ గా కనిపించాయి.

విశ్లేషణ: అక్కడక్కడా నవ్వించే కొన్ని సన్నివేశాలు తప్పిస్తే “ఆడవాళ్ళు మీకు జోహార్లు” సినిమాలో చెప్పుకోదగ్గ లేదా థియేటర్ దాకా వెళ్ళి చూడదగ్గ విషయం ఒక్కటి కూడా లేదు. సొ, కిషోర్ తిరుమల స్లో స్క్రీన్ ప్లేకి ఫ్యాన్ అయితే తప్ప ఈ సినిమాని ఆస్వాదించలేరు. ఇక మీ ఓపిక!

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus