ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!

వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న సూర్య కథానాయకుడిగా నటించి, నిర్మాతగా వ్యవహరించిన చిత్రం “ఆకాశం నీ హద్దు రా”. విభిన్న చిత్రాల దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కెన్ కెప్టెన్ గోపీనాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. విడుదలైన ప్రోమోలు, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. నిన్న రాత్రి అమేజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం.

కథ: చంద్ర మహేష్ (సూర్య) ఆవేశం ఉన్న యువకుడు. తన తండ్రిని ఆఖరి చూపు చూసుకోవడానికి కుదరకపోవడానికి కారణమైన అధిక ధరకు అమ్ముతున్న విమానం టికెట్లు సామాన్యుడికి కూడా అందుబాటులోకి రావాలనే ధ్యేయంతో ఉన్న పైలెట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇద్దరు స్నేహితుల సహకారంతో “ఎయిర్ డెక్కెన్” అనే విమానయాన సంస్థను స్థాపించే దిశగా పయనం మొదలెడతాడు. ఆ పయనంలో ఎన్నో ఆటుపోట్లు, చాలాసార్లు వెనకడుగేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అవన్నీ తట్టుకొని నిలబడి, తన సహచరి సుందరి అలియాస్ బేబీ (అపర్ణ బాలమురళి) ప్రోద్భలంతో.. పరేష్ (పరేష్ రావల్) లాంటి ఒక తిమింగళాన్ని ఎదుర్కొని తన ఆశయాన్ని, సగటు వ్యక్తి ఫ్లయిట్ ఎక్కాలనే కలని ఎలా నెరవేర్చాడు అనేది చిత్ర కథనం.

నటీనటుల పనితీరు: సూర్య గొప్ప నటుడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. మన భారతీయ నటుల్లో కళ్ళతోనే సన్నివేశంలోని ఎమోషన్ ను అద్భుతంగా పలికించినగల అతికొద్దిమంది నటుల్లో సూర్య ఒకరని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. తెలుగులో చిరంజీవి, తమిళంలో కమల్, మలయాళంలో మోహన్ లాల్.. ఇలా అద్భుతమైన నటుల జాబితాలో “ఆకాశం నీ హద్దు రా” చిత్రంతో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు సూర్య. అతడి కళ్ళలో కోపం సెగ టీవీ ముందు కూర్చుని సినిమా చూస్తున్న ప్రేక్షకుల గుండెకు తగులుతుంది. సూర్య లాంటి దిగ్గజం పక్కన హీరోయిన్ అంటే ఎంతటి అందాలరాశి అయినా తేలిపోతుంది. కానీ.. మలయాళ కుట్టి అపర్ణ బాలమురళి అందాల భామ మాత్రమే కాదు, అభినయ సామర్ధ్యం మెండుగా కలిగిన నటి. చాలా సన్నివేశాల్లో సూర్య స్క్రీన్ ప్రెజన్స్ ను కూడా డామినేట్ చేసింది. సూర్య ఇన్నేళ్ల కెరీర్ లో అతడికి పోటీగా నటించిన ఏకైక నటి అపర్ణ. పరేష్ రావల్ ను సౌత్ స్క్రీన్ పై ఒక అర్ధవంతమైన పాత్రలో చాలారోజుల తర్వాత చూడడం ఆనందాన్నిచ్చింది. ఆ పాత్రను ఆయన తప్ప మరెవరూ ఆస్థాయిలో చేయలేరు. ఇక మోహన్ బాబు కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఒకటిగా ఈ చిత్రంలోని నాయుడు పాత్ర నిలుస్తుంది. సినిమాలో ఏ ఒక్క పాత్ర ఎక్కువ అనిపించదు, ఏ ఒక్క పాత్ర అనవసరం అనిపించదు. ఈ క్రెడిట్ మాత్రం దర్శకురాలికే ఇవ్వాలి.

సాంకేతికవర్గం పనితీరు: సాధారణంగా లేడీ డైరెక్టర్స్ అనగానే ఏముందిలే లవ్ స్టోరీస్ మాత్రమే తీయగలరు లేదంటే కామెడీ సినిమాలు తీస్తారు అనుకొంటాం. చాలామంది అదే చేస్తున్నారు కూడా. అయితే.. ఆ జింక్స్ ను బ్రేక్ చేసిన దర్శకురాలు సుధ కొంగర. మొదటి తమిళ చిత్రం “ద్రోహి (2010)” మొదలుకొని “ఆకాశం నీ హద్దు రా” వరకు ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండేలా చూసుకొని.. అటు ప్రశంసలతోపాటు ఇటు బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడం అనేది మాత్రం లేడీ డైరెక్టర్స్ లో కేవలం సుధకు మాత్రమే సాధ్యమైంది. లేడీ క్యారెక్టర్స్ ను స్ట్రాంగ్ గా ఎలివేట్ చేయడం సుధ స్పెషాలిటీ. ఈ చిత్రంలో సుందరి పాత్ర సుధ రాసిన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ లో ది బెస్ట్. అలాగే.. ఒక నటుడు/నటి నుంచి ఎంత ఎమోషన్ రాబట్టుకోవాలి అనేది తెలిసిన అతికొద్ది మంది దర్శకుల్లో సుధ ఒకరు. అందుకే.. ఆమె సినిమాల్లో పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోతాం. నిడివి కాస్త తగ్గించి ఉంటె బాగుండేది అనే ఆలోచన వచ్చినప్పటికీ.. చంద్రమహేశ్ పడిన శ్రమ, అతడు ఎదుర్కొన్న అవరోధాలు చూపించడానికి ఆమాత్రం నిడివి ఉండాలి అనిపిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టు.. ఎమోషనల్ ఎలివేషన్స్ కి అతడి సంగీతం ఊపిరి పోసింది. నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఫ్రేమింగ్స్, లైటింగ్ ఒక అద్భుతమైన సినిమాటిక్ ఫీల్ ఇచ్చాయి. ఎడిటింగ్, డి.ఐ, ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్, సి.జి.ఐ ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ తమ బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు.

విశ్లేషణ: ఒక సినిమా చూసాక వెంటనే కదలబుద్ధి అవ్వదు. తెరపై ఎండ్ క్రెడిట్స్ వస్తున్నా మనసులో ఒక సంతృప్తితో కూర్చుని ఉంటాం. అది ఆనందమైన ఉద్వేగం. చాలా అరుదుగా ఆ ఉద్వేగానికి గురవుతుంటాం. ఆ ఉద్వేగాన్నిచ్చిన చిత్రం “ఆకాశం నీ హద్దు రా”. సూర్య నటన, అపర్ణ పాత్ర చిత్రణ, సుధ కొంగర దర్శకత్వం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నికేత్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని ఒక మాస్టర్ పీస్ లా మలిచాయి. సూర్య కెరీర్ లోనే కాదు, బెస్ట్ సౌత్ సినిమాల లిస్ట్ లో “ఆకాశం నీ హద్దు రా” ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

రేటింగ్: 3.5/5

ఫ్లాట్‌ఫార్మ్: ప్రైమ్ వీడియో

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus