హీరోయిజం ఎలివేషన్, అభిమానుల ఆనందం, తెగింపు, ధైర్యం, డేరింగ్ హీరో అనిపించుకోవాలనో కోరిక… ఇలా కారణం ఏదైనా కావొచ్చు… మన కుర్ర హీరోలు ఈ మధ్య కాలంలో రిస్క్‌లు బాగా చేస్తున్నారు. రియాలిటీ కనిపించాలి అనుకుంటూ… కష్టతరమైన ఫైట్లు, జంప్‌లు, బ్లాస్ట్‌ల్లో డూప్‌లు లేకుండా చేసేస్తున్నారు. అయితే ప్రతిసారి అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. టైమింగ్ మిస్ అవ్వడమో, పొరపాట్లు వల్ల హీరోలు గాయాలపాలవుతున్నారు. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఒకరిద్దరు కుర్ర హీరోలు గాయాలపాలయ్యారు. ఇప్పుడు కన్నడ వుడ్‌లో ఒక హీరో ఇలానే గాయపడ్డారు.
శాండిల్‌వుడ్‌కి చెందిన కన్నడ హీరో రిషబ్ శెట్టి తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. హాసన్ జిల్లా బేలూరులో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడుఈ సంఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘హీరో’ అనే ఓ కన్నడ సినిమా షూటింగ్ సందర్భంగా … ఓ సీన్‌లో హీరో రిషబ్ శెట్టి పైకి పెట్రోల్ బాంబు విసరాలి. అదే సమయంలో హీరో పక్కకు జరగాలి. రిహార్సిల్‌లో అంతాబాగానే సాగింది. అయితే టేక్‌కి వచ్చేసరికి హీరో జరగడం కాస్త ఆలస్యమైంది. దీంతో బాంబు హీరో దగ్గరే పేలి… మంటలు అంటుకున్నాయట. ఈ ఘటనలో రిషబ్‌కు గాయాలు అయ్యాయి. దాంతో చిత్రీకరణ నిలిపేసి ఆసుపత్రికి తరలించారు.
ముందుగా చెప్పుకున్నట్లు రియాలిటీ కోసం, ఇమేజ్ కోసం ఇలా డూప్‌లు వాడకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ మొదలైంది. అన్నీ అనుకున్నట్లుగా జరగాలని ప్రతి సారి కోరుకోవడం, జరగడం కష్టమే. అందుకే వీలైనంతవరకు డూప్‌లు వాడితే మంచిదని చాలామంది సీనియర్లు చెబుతూ వచ్చేవారు. ఒకప్పుడు మన హీరోలు ఇలానే చేసేవారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఇవి ఆలోచించడం, తర్వాత ఎప్పటిలా నడుచుకోవడం పరిశ్రమలో చూసేదే. కాబట్టి పెద్ద మార్పు ఏమీ ఉండదు అనుకుంటున్నారు నెటిజన్లు.