Shamlee: ‘ఓయ్’ హీరోయిన్ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!
- February 28, 2026 / 05:44 PM ISTByFilmy Focus Desk
బేబీ షామిలి కాస్తా హీరోయిన్ షామిలీగా మారి కొన్ని సినిమాలు చేసినా సరైన విజయం దక్కక కథానాయికగా నటించడం మానేసింది. బాలనటిగా మంచి పేరు సంపాదించుకున్న ఆమె.. హీరోయిన్‌గా రాణించలేదు. అయితే ఇప్పుడు ‘ఆర్టిస్ట్’గా రాణిస్తోంది. ఆర్టిస్ట్ అంటే నటి కాదు.. చిత్రలేఖనం ఆర్టిస్ట్ అన్నమాట. సినిమాల చేస్తున్న సమయంలోనే ఆమె సింగపూర్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్‌లో డిప్లొమా చేసింది. పారిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. చైనీస్ ఇంక్ పెయింటింగ్, ఇటలీలోని అకడమియా రియాచి ఇన్ ఫ్లోరెన్స్ నుండి గ్లాస్ పెయింటింగ్, డిజిటల్ ఆర్ట్స్ నేర్చుకుంది.
Shamlee
సినిమా షూటింగ్‌లో షాట్స్ మధ్య గ్యాప్‌లో బొమ్మలు గీసేదట. ఫిగరేటివ్ పెయింటింగ్ షామిలి ప్రత్యేకత. మహిళల చిత్రాలు, రోజువారీ కార్యకలాపాలు, భావోద్వేగాలు వంటివి ఆమె చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు చిత్రలేఖనాన్నే ప్రధానంగా చేసుకుంది. వివిధ ప్రపంచస్థాయి ఎగ్జిబిషన్లలో తరచూ పాల్గొంటోంది. ఆర్టిస్ట్‌గా నటించడం మానేసిన తర్వాత షామిలి.. ఇప్పుడు ‘ఆర్టిస్ట్’గా రాణిస్తోంది. అంటే ఇక సినిమాలను వదిలేసినట్లేనా అని అడిగితే.. భవిష్యత్తులో సినిమాలు నిర్మించే ఆలోచనలోనూ ఉన్నా అని చెప్పింది.

‘అంజలి’ సినిమాను ఎవరూ మరచిపోలేరు. నాలుగేళ్ల వయసులో మానసిక స్థితి సరిగాలేని చిన్నారిగా షామిలి నటించి మెప్పించింది. అందుకే జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత బాలనటిగా దక్షిణాదిన అన్ని భాషల్లో నటించింది. ఆ రోజుల్లో బాలనటిగా దక్షిణ భారత సినిమా పరిశ్రమల్లో స్టార్. అప్పట్లో ఎక్కువ సంపాదించిన చిన్నారిగా పేరు కూడా తెచ్చుకుంది. ఈ క్రమంలో కేరళ, కర్ణాటక స్టేట్ అవార్డులు కూడా వచ్చాయి.

హీరోయిన్ అయ్యాక నాలుగు సినిమాలే చేసింది. ‘ఓయ్’ సినిమాతో 2009లో అరంగేట్రం ఇచ్చిన షామిలి ఆ తర్వాత ఏడేళ్లకు ‘వల్లీమ్ తెట్టి పుల్లీమ్ తెట్టి’ అనే మలయాళ సినిమాలో నటించింది. అదే ఏడాది ‘వీర శివాజీ’ అనే తమిళ పిక్చర్‌లో నటించింది. అక్కడికి రెండేళ్లకు అంటే 2018లో ‘అమ్మమ్మగారిఇల్లు’ అనే తెలుగు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ నటించలేదు.











