తెలుగు చలన చిత్ర చరిత్రలో రాఘవేంద్రరావుది సువర్ణాధ్యాయం. తెలుగు చిత్రానికి కమర్షియల్ లెక్కలు నేర్పింది ఆయనే. హీరో కనిపిస్తే థియేటర్లలో కాసుల వర్షం కురిసేలా చేసిన దర్శకుడాయన. అలాగే బాక్సాఫీసు దగ్గర కోట్ల వసూళ్లు కురిపించిన దర్శకుడూ ఆయనే. ఎన్టీఆర్, ఏయన్నార్ నుండి మహేష్‌బాబు, అల్లు అర్జున్ వరకు అందరితోనూ హిట్లు కొట్టారు. ఇన్నాళ్లు కెమెరా వెనుకుండి మ్యాజిక్ చేసిన రాఘవేంద్రరావు.. ఆ మధ్య ‘సౌందర్య లహరి’ పేరుతో బుల్లి తెర మీదకు వచ్చి తన అనుభవాల్ని నేటి తరం దర్శకులకు చెప్పారు. ఇప్పుడు పుస్తక రచయితగా మారారు.
‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’ అంటూ తన సినీ జీవిత ప్రయాణాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు దర్శకేంద్రుడు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభినందనలతో, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు. సోమవారం రాఘవేంద్రరావు 80వ పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకానికి సంబంధించిన విశేషాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు, అభినందనలు చెప్పారు రాఘవేంద్రరావు.
‘‘ఈ పుట్టిన రోజు నాకెంతో ప్రత్యేకమైనది. నా జీవితంలో మొదటిసారి పుస్తకం రాశాను. దర్శకుడిగా శతాధిక చిత్రాలను రూపొందించాను. ఈ క్రమంలో నేను నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, అనుభూతులు నా తర్వాతి తరాలకు ఉపయోగపడేలా ఈ పుస్తకం తీర్చిదిద్దాను. ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమలోని ఈతరం దర్శకులంతా ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉంది. నా నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ వేడుక జరగడం సంతోషాన్నిచ్చింది’’ అని చెప్పారు రాఘవేంద్రరావు.
‘‘అబద్ధాలు రాయడం అనర్థం. నిజాలు రాయటానికి భయం’ అంటూ దీన్ని మనసు అనే పెన్‌తో రాశాను. ఈ పుస్తకాన్ని చాలా ఓపెన్‌గా లిఖించాను. ఏదీ కప్పి చెప్పలేదు. అలాగే విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం ఉంటుంది. ఈ పుస్తకం త్వరలో నవోదయ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. పాఠకులందరూ దీన్ని చదివి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ను అని చెప్పారు రాఘవేంద్రరావు.