ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు, దర్శకుడు కత్తి మహేష్ ఈ నెల 26వ తేదీన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో కత్తి మహేష్ తల భాగంలో తీవ్ర గాయాలు కాగా మొదట కత్తి మహేష్ నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కొరకు కత్తి మహేష్ ను చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కత్తి మహేష్ మరణించారు.
గతంలో వైద్యులు కత్తి మహేష్ ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పినప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్సకు కోలుకోలేక కత్తి మహేష్ మృతి చెందినట్టు తెలుస్తోంది. కత్తి మహేష్ మృతితో ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. సినీ క్రిటిక్ గా ప్రేక్షకులకు సుపరిచితమైన కత్తి మహేష్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం ద్వారా పలు సందర్భాల్లో కత్తి మహేష్ వార్తల్లో నిలిచారు. పవన్ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో కత్తి మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మద్దతుదారునిగా కత్తి మహేష్ పేరు తెచ్చుకున్నారు. అయితే వైసీపీ పార్టీ తప్పులు చేసిన సమయంలో ఆ తప్పులను మాత్రం కత్తి మహేష్ సమర్థించలేదు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి ప్రముఖ యాంకర్ టీఎన్నార్ మృతి చెందగా తాజాగా కత్తి మహేష్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు.