స్పెషల్ ఇంటర్వ్యూ : ‘రంగస్థలం’ మహేష్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన మహేష్ ఆచంట…ఆ తరువాత ‘శతమానం భవతి’ ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘గుణ 369’ ‘జాతి రత్నాలు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకి చెందిన మహేష్… సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర్నుండీ అతను ఫేస్ చేసిన అనుభవాలను అలాగే తన ఫ్యూచర్ ప్రాజెక్టులకి సంబంధించిన విషయాలను, ఇప్పటికి వరకు అతను మిస్ చేసుకున్న సినిమాల విషయాలను… తాజాగా ఫిల్మీ ఫోకస్ తో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం :

ప్ర. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అవుతుంది?

జ. 2011 లో ఇండస్ట్రీకి అడుగుపెట్టాను. ఓ పక్కన జాబ్ చేసుకుంటూ మరో పక్క సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వచ్చాను.అయితే 2013 నుండీ ఇక సినిమానే లైఫ్ అని డిసైడ్ అయ్యాను.

ప్ర. మీరు వెండితెర పై కనిపించిన మొదటి సినిమా ఏది?

జ. రానా గారు హీరోగా నటించిన ‘నా ఇష్టం’ మూవీలో ఓ మాస్ సాంగ్ ఉంటుంది. అందులో నేను కాసేపు కనిపించాను. నేను స్క్రీన్ పై కనిపించిన మొదటి సినిమా అయితే అదే..!

ప్ర.మీరు సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?

జ. ఆ టైములో నేను చాలా స్టూడియోలు, ఆఫీస్ లు చుట్టూ తిరిగాను.అవకాశాల కోసం బాగా కష్టపడ్డాను. అయితే ఇప్పుడు సినిమాల్లోకి రావాలనుకునే వాళ్లకి టిక్ టాక్, రీల్స్ వంటి సోర్స్ లు ఉన్నాయి. అందులో తమ ట్యాలెంట్ చూపించే వాళ్లకి సినిమాల్లో అవకాశాలు ఈజీగా దొరుకుతున్నాయి.

ప్ర.అంటే ఎటువంటి కష్టాలు పడ్డారు?

జ. గతంలో నేను దర్శకుడు మారుతీ గారి షూటింగ్ కోసం క్రేన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి వెళ్ళాను.అప్పుడు సప్తగిరి అన్నయ్య, ప్రవీణ్ అన్నయ్య పరిచయమయ్యారు.ఆ షూటింగ్లో భాగంగా నాటకాల సెట్ ఒకటి వేశారు.ఆ నాటకాల స్టాఫ్ లో ఒకడిగా నన్ను నిలబెట్టారు.అటు తర్వాత కొన్నేళ్ల తర్వాత మారుతీ గారి డైరెక్షన్లో చేశాను.’ప్రతిరోజూ పండగే’ మూవీకి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ ఫస్ట్ డేన ఆయన నన్ను ‘మహేష్ రెడీనా.. యాక్షన్’ అంటుంటే అది నాకు బెస్ట్ మూమెంట్ అనిపించింది.

ప్ర. మిమ్మల్ని ఇండస్ట్రీలో బాగా ప్రోత్సహించింది ఎవరు?

జ. ‘జబర్దస్త్’ షోలో చేస్తున్నప్పుడు నన్ను రైటర్ ప్రసన్న గారు బాగా ప్రోత్సహించేవారు.ఆయన ప్రోత్సాహాన్ని జీవితాంతం మర్చిపోలేను. తరువాత నాగబాబు గారు కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ‘కెవ్వు కేక’ అనే షో చేస్తున్నప్పుడు సుమక్క(యాంకర్ సుమ) కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఇక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు డైరెక్టర్ సుకుమార్ గారిని ఎక్కువగా కలిసేవాడిని. ట్యాలెంట్ ఉన్న వాళ్ళని, హార్డ్ వర్క్ చేసే వాళ్ళని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టరు. ఆయన ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది.

ప్ర.’రంగస్థలం’ లో మీకు అంత మంచి పాత్ర దొరకడానికి అదే కారణమా?

జ. సుకుమార్ గారు అంతకు ముందు నుండీ నాకు తెలుసండీ. ఒకానొక టైములో ‘ఆయన నన్ను పట్టించుకోవడం లేదేంటి..!’ అని నాకు అనిపించేది.”కుమారి 21 ఎఫ్’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో నాకేదైనా క్యారెక్టర్ ఇచ్చి ఉంటే బాగుండేది.. ఎందుకు ఆయన నాకు ఇవ్వలేదు’ అనే విషయం నాకు అర్ధం కాలేదు. కానీ ‘రంగస్థలం’ వంటి పెద్ద హిట్ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. అంటే చిన్న చిన్న పాత్రల్లో వీడిని ఇరికించకూడదు. ఓ మంచి పాత్ర వీడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన నన్ను అప్పటి వరకు పక్కన పెట్టారని అర్ధమైంది.

ప్ర.స్టార్ హీరోలు ఎవరైనా మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా?

జ. ‘రంగస్థలం’ తర్వాత మహేష్ బాబు గారు ‘ఆ అబ్బాయిని ఒకసారి ఇంటికి లంచ్ కు తీసుకురండి’ అని సుకుమార్ గారికి చెప్పారట.

ప్ర. వెళ్ళారా మరి మహేష్ గారి ఇంటికి?

జ. లేదండీ.. ఆ మాట అన్నారు అది చాలు అనిపించింది. ఆయన 25వ సినిమా ‘మహర్షి’ లో ఓ సీన్లో కనిపించాను. దిల్ రాజు గారు తన సినిమాల్లో చాలా వరకు నాకు ఛాన్స్ ఇస్తారు. అది చిన్న సీన్ అయినా సరే.. నేను ఆయన సినిమాలో కనిపిస్తే హిట్ అని ఆయన అంటుంటారు. ‘కేరింత’ ‘నేను లోకల్’ ‘సుప్రీమ్’ శతమానం భవతి’ ‘మహర్షి’ రాజా ది గ్రేట్’… అలా నేను ఆయన బ్యానర్లో చేసిన అన్ని సినిమాలు హిట్టే..! ఒక్క ‘శ్రీనివాస కళ్యాణం’ తప్ప.

ప్ర. హో.. అంటే దిల్ రాజు గారికి మీరు సెంటిమెంట్ అనమాట..!

జ. (నవ్వుతూ).. పూర్తిగా అదే అని చెప్పనండీ..! కానీ ‘స్వప్న సినిమా’ బ్యానర్ వాళ్ళు కూడా నాతో ఆ మాట అంటుంటారు. వాళ్ళు చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నేను నటించాను. కానీ లెంగ్త్ ప్రాబ్లమ్ వల్ల నా పాత్ర ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చింది. అయితే ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ సినిమాల్లో నాకు మంచి పాత్రలు ఇచ్చారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్- హను రాఘవపూడి కాంబినేషన్లో వాళ్ళు నిర్మిస్తున్న మూవీలో కూడా నాకు ఛాన్స్ ఇచ్చారు.

ప్ర. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా?

జ. రాంచరణ్ గారు నాకు ఓ గొప్ప మాట చెప్పారు అండి. ఆయన తాతయ్య గారైన అల్లు రామలింగయ్య గారు చరణ్ గారికి చిన్నప్పుడు చెప్పిన మాట అట ఇది..! అదేంటంటే..’పెదవి దాటిన మాటకి నువ్వు బానిస.. పెదవి దాటని మాటకి నువ్వు రాజు’ అని చెప్పారు. ఎప్పటికీ ఆ మాట నేను మర్చిపోలేను. ‘చరణ్ గారు.. ఎందుకు ఎప్పుడూ సైలెంట్ గా ఉంటారండీ మీరు’ అని నేను ఆయన్ని అడిగినప్పుడు ఆయన నాకు ఈ మాట చెప్పారు.

ప్ర. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో ఎక్కువ ప్రశంసలు కురిపించిన సినిమాలు ఏంటి?

జ. ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ సినిమాలే నండీ..! అయితే ‘గుణ 369’ అనే సినిమా కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అండి. అది చాలా మంచి పాత్ర అని చాల మంది చెప్పారు.

ప్ర. ఆ మూవీలో మీరు నటించేప్పుడు అంత మంచి పాత్రే అని మీకు తెలుసా?

జ. లేదండీ.. డైరెక్టర్ అర్జున్ గారు నా పాత్రని చాలా బాగా డిజైన్ చేశారు. ‘క్లైమాక్స్ లో హీరోతో ఫైట్ కూడా పెడదామనుకుంటున్నాను.. 6ప్యాక్ ఏమైనా చేస్తావా .. 3 నెలలు ఆగుతాను’ అని కూడా చెప్పారు. నాకు అంత ప్రాముఖ్యత ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ‘అలాంటిదేమి వద్దండీ అని చెప్పేసాను’.

ప్ర. హీరోగా కూడా ఓ సినిమా చేసినట్టు ఉన్నారు?

జ. ‘నేను నా నాగార్జున’ అనే సినిమా అండీ..! అలాగే ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ అనే సినిమాలో కూడా నేను హీరోగా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వలన చేయలేకపోయాను. కానీ దర్శకుడు ఆ సినిమా చాల బాగా తీసాడు అనిపించింది అండీ.

ప్ర. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

జ. విశ్వక్ సేన్ గారితో చేసిన ‘పాగల్’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.ఆ చిత్రం దర్శకుడు నరేష్ నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో నాకు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చాడు. అలాగే ఇందాక చెప్పినట్టు.. ‘దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి’ గారి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో కూడా నటిస్తున్నాను అండీ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus