నిరుపమ్ పరిటాల.. ఈ పేరు చెబితే తొందరగా ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు, అదే డాక్టర్ బాబు అనగానే అందరికీ వెంటనే స్ట్రైక్ అవుతారు. అంతలా ఈయన్ని పాపులర్ చేసింది ‘కార్తీక దీపం’ సీరియల్. ఇక నిరుపమ్.. దివంగత నటుడు, రచయిత అయిన ఓంకార్ గారి కొడుకు అన్న సంగతి బహుశా చాలా తక్కువ మందికే తెలిసుండొచ్చు. ఇదిలా ఉండగా.. ఇటీవల నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి మనకు తెలియని విషయాలను చెప్పి ఎమోషనల్ అయ్యాడు.
అతను మాట్లాడుతూ.. “నేను పుట్టింది విజయవాడలో .. పెరిగింది చెన్నైలో .. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో.! మా నాన్నగారు ఓంకార్ గారు రచయిత .. నటుడు. నేను బాగా చదువుకుని ఏదైనా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని మా అమ్మానాన్నలు కోరుకునే వారు. కానీ నాకేమో యాక్టింగ్ పైనే ఇంట్రెస్ట్ ఉండేది.! అదే విషయాన్ని ఓ రోజు మా నాన్నగారితో చెప్పాను. దాంతో ఆ రాత్రంతా ఆయన నిద్ర పోలేదు. మా అమ్మ అయితే ఏడ్చి గోల చేసేసింది. అయినప్పటికీ మా నాన్నగారు నా ఇష్ట ప్రకారమే చేయాలనుకున్నారు.ఆ టైములో ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చేసింది.
ఈ క్రమంలో మా నాన్నగారు కూడా మా ఫ్యామిలీని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయాలని భావించారు. రైటర్ గా, నటుడిగా సీరియల్స్ చేస్తూ ఆయన చెన్నైలో చాలా బిజీగా ఉండేవారు. నా కోసం ఆ అవకాశాలను వదులుకొని హైదరాబాద్ రావడానికి సిద్ధపడ్డారు. హైదరాబాద్ లో ఇల్లు కూడా చూసారు. ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఆయన దూరమైపోవడంతో ఏం చెయ్యాలో నాకర్ధం కాలేదు. నన్ను నటుడిగా చూడాలనే కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు. అది చాలా దురదృష్టకరం” అంటూ చెప్పి భావోద్వేగానికి లోనయ్యాడు నిరుపమ్.