భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సినిమా వాళ్లతో పాటు రాజకీయ నాయకులు కూడా సిద్ధార్థ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో సిద్ధార్థ్ ను ఏకిపారేస్తున్నారు. అతడు చేసిన సెక్సీస్ట్ కామెంట్స్ మహిళలను కించపరిచేలా ఉండడంతో అందరూ సిద్ధార్థ్ ను తప్పుబడుతున్నారు. దీంతో వెంటనే ట్విట్టర్ వేదికగా సైనాకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖను పోస్ట్ చేశారు సిద్ధార్థ్.
‘డియర్ సైనా..మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలంటే నాకెంతో గౌరవం. నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా.
నువ్వెప్పుడూ నా చాంపియన్‌గా ఉంటావు’ అంటూ రాసుకొచ్చాడు. సైనా నెహ్వాల్.. సిద్ధార్థ్ లెటర్ పై స్పందిస్తూ.. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. కానీ ఫైనల్ గా తప్పు తెలుసుకొని సారీ చెప్పడం మంచిదని తెలిపింది. ఇక్కడితో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందని భావించారంతా. కానీ ఇప్పుడేమో సిద్ధార్థ్ పై పోలీసులు కేసు నమోదైంది. సైనా నెహ్వాల్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బంజారాహిల్స్‌కు చెందిన ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్ పై ఫిర్యాదు చేసింది.
ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి దీనిపై సిద్ధార్థ్ ఎలా స్పందిస్తాడో చూడాలి!