మెగాస్టార్ కి జోడీగా శ్రుతీ హాసన్..?

‘సైరా’ చిత్ర షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిమెగా పవర్ స్టార్ రాంచరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది మెగాస్టార్ కు 151 వ చిత్రం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈ చిత్రం తరువాత మెగాస్టార్ తన 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

మంచి సోషల్ మెసేజ్ తో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి రైతుగా కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేదానిపై పెద్ద కన్ఫ్యూషన్ ఏర్పడింది. మొదట ఈ చిత్రంలో నయనతార లేదా అనుష్కని హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం… కొరటాల శివ తన ‘శ్రీమంతుడు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రుతీ హాసన్ ను.. మెగాస్టార్ తో చేయబోయే సినిమా కోసం ఎంచుకున్నారని తెలుస్తుంది. అయితే శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా కాకుండా ఓ కీలక పాత్రలో చూపించబోతున్నారట. మరి ఈ వార్తాలో ఎంత వరకూ నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus