పదేళ్లకు ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తాయి.. ‘దహనం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆదిత్య ఓం

  • March 28, 2023 / 10:01 AM IST

నటుడు ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు. తాజాగా జరిగిన రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా ఆదిత్య ఓం అవార్డు గెలుచుకున్నారు. అలాంటి ఆదిత్య ఓమ్ హీరోగా ఓపెన్ ఫీల్డ్ మీడియా పతాకంపై డాక్టర్- శ్రీపెతకంశెట్టి సతీష్ కుమార్ నిర్మాతగా ఆడారి మూర్తి సాయి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దృశ్య కావ్యం ఈ నెల 31వ తేదీన విడుదల సందర్భంగా ఈ ప్రి రిలీజ్ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

నిత్యం ఆ శివుడి ధ్యానం.. చిన్నప్పటి నుంచి ఆ శివుడి నామస్మరణ తప్పా నాకు మరొకటి తెలియదు.. సమస్త జీవితం ఆయనే.. ఈ దేవాలయమే నా దేహమని.. ఆ శివుడే నా అంతరాత్మ అంటూ సాగే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఎన్నో ఆలోనలు రేకెత్తించేలా ఉంది. చితిలో నువ్ కాల్చే మంటలు.. నేను దేవుడి కోసం ఇచ్చే హారతి వెలుగు రూపం ఒక్కటే.. అర్థాలు వేరు.. అంటూ ఆదిత్య చెప్పే డైలాగ్‌లు ట్రైలర్‌లో అద్భుతంగా ఉన్నాయి. భైరాగి, పూజారి, ఊరి పెద్ద చుట్టూ జరిగే కథే దహనం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘లాహిరి లాహిరి లాహిరి సినిమా తరువాత ఆదిత్యను వేదికల మీద ఎక్కువగా కలవలేదు. బయట కలిసేవాళ్లం. ఈ పోస్టర్‌ను చూస్తుంటే కళ్లు, కంటిబొమ్మల్లోనూ సంఘర్షణను చూపించారు. నిర్మాతలకు అనుగుణంగా నటిస్తారు. ఎంతో అంకితభావంతో పని చేస్తారు. ట్రైలర్‌ బాగుంది. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ‘దహనం సినిమాను సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను మరింతగా ముందుకు తీసుకెళ్లంది. ప్రతీ శుక్రవారం సినిమాలు వస్తాయి. కానీ దహనం లాంటి సినిమాను ఏ ఐదేళ్లకో, పదేళ్లకో వస్తాయి. ఈ సినిమాను ఇంత గొప్పగా తీసిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇంత పెద్ద రిస్క్‌ తీసుకున్నారు. ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు. ప్యాషన్‌తో తీసిన ప్రాజెక్ట్’ అని అన్నారు.

డైరెక్టర్ ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ.. ‘వర్తమాన, భూత, భవిష్యత్‌ కాలాల్లో నీరు నిప్పు గాలితో అవసరం ఉంటుందని చెప్పే కథ ఇది. శ్మశానంలో ఉండే బైరాగి శివ లింగాన్ని తాకాలనే కోరికతో ఉంటాడు. తరతరాలుగా పూజలందుకుని మూతపడ్డ శివాలయానికి మళ్లీ పూజలు చేయాలనే కోరికతో ఆదిత్య ఓం పాత్ర ఉంటుంది. పాత కాలంలో ఉన్న తమ పూర్వీకుల ఆస్థి, అందులోని గుడిని కూడా కావాలనే ఆశపడే పాత్ర లో భూపతి కనిపిస్తారు. ఈ మూడు పాత్రల చుట్టూ కథ జరుగుతుంది’ అని అన్నారు.

నిర్మాత డాక్టర్ శ్రీపెతకంశెట్టి
సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘నేను డాక్టర్‌గా వృత్తిపరంగా ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడాను. కానీ ఇలా సినిమా ఈవెంట్‌లో మాట్లాడటం మొదటి సారి. కరోనా సమయంలో ఈ కథ విన్నాను. నచ్చి సినిమాను నిర్మించాను. నాకు చిన్నతనం నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. ముందుగా ఈ సినిమాకు లిరిక్స్, మ్యూజిక్ కోసం వచ్చాను. చివరకు నిర్మాతగా మారాను. నా వృత్తితో పాటు, నా ప్రవృత్తిని కూడా ఆదరించండి’ అని కోరారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘లాహిరి లాహిరి లాహిరి సినిమాలో ఆదిత్య ఓంను చూసి అద్భుతమైన నటుడని అనుకున్నాను. నార్త్ నుంచి వచ్చి ఇంత మంచి సినిమాలో నటించాడు. కళ్లు, కంటిబొమ్మలు, నుదురు ఇలా అన్నింటితో నటించారు. బైరాగి పాత్ర కూడా బాగుంది. ఈ సినిమాకు కచ్చితంగా జాతీయ అవార్డులు వస్తాయి. గోవా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శింపబడుతుంది. డిస్ట్రిబ్యూటర్ల వల్లే సినిమా బయటకు వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ గారు ఈ సినిమాను గొప్పగా రిలీజ్ చేయాలని’ అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘సినిమాను చూడక ముందు.. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకేం వస్తుందని అనుకున్నాను. కానీ సినిమాను చూశాక.. కంటతడితో బయటకు వచ్చాను. ఈ సినిమాకు అందరూ సహాయం చేయండి. ఫిల్మ్ ఛాంబర్‌ నుంచి కూడా మాకు సాయం అందించండి. నైజాం, సీడెడ్ ఇలా అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లంతా కూడా నాకు అండగా నిలబడ్డారు’ అని అన్నారు.

మాదాల రవి మాట్లాడుతూ.. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గర్వించదగ్గ నటుడు ఆదిత్య. ఎన్నో సినిమాల్లో నటించారు. ఆశయం కోసం చివరి వరకు పోరాడుతూనే ఉండండి. ఇంత చక్కటి సినిమాను నిర్మించిన నిర్మాత, దర్శకుడికి ధన్యవాదాలు. సినిమాలో నటించిన ప్రతీ ఒక్క నటీనటులకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘లాహిరి లాహిరి లాహిరి సినిమాతో ఆదిత్య ఓం ఇరగ్గొట్టేశాడు. సినిమా అంటే జీవితం అని అనుకుంటాడు. ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సబ్జెక్ట్ ఉన్న సినిమాలు ఇప్పటి సమాజానికి అవసరం’ అని అన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమాకు అవార్డులు ఎంత ముఖ్యంగా కమర్షియల్‌గా రివార్డులు కూడా అంతే ముఖ్యం. కమర్షియల్‌గానూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ.. ‘ఈ సినిమా దర్శక నిర్మాతలు, నటీనటులందరికీ నమస్కారాలు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇంకా కులాల కుమ్ములాట ఉంది. కుల రహిత సమాజం ఉండాలంటూ తీసే సినిమాలు రావడం అరుదు. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన నిర్మాతకు ధన్యవాదాలు. డబ్బు కోసం కాకుండా.. సందేశం ఇవ్వాలని సినిమాను తీశారు’ అని అన్నారు.

జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ‘గుడి మెట్లు ఎక్కాలి.. శివుడ్ని తాకాలని కోరుకునే భైరాగి. కులం తక్కువ అని తిరస్కరించే ఊరు. ఇండియాలోని ప్రతీ ఊరికి ఈ సినిమాతో లింక్ ఉంటుందనిపిస్తుంది. ప్రతీ ఊర్లో శ్మశానం ఉంటుంది. ఆ భైరాగి శివుడ్ని తాకే పులకించే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్ చూశాకే ఈవెంట్‌కు రావాలని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని తీయాలని’ కోరారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus