స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. సాధారణంగా బాలయ్య సినిమాలకు హిట్ టాక్ వచ్చినా నైజాం, ఓవర్సీస్ లో కలెక్షన్లు తక్కువగా వస్తాయి. అయితే అఖండ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది. అఖండ మూవీతో నైజాం, ఓవర్సీస్ మార్కెట్ లో బాలయ్యకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం హాట్ స్టార్ ఓటీటీ యాప్ లో అఖండ మూవీ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
తెలుగుతో పాటు మలయాళంలో కూడా అఖండ అందుబాటులో ఉంది. మలయాళ ప్రేక్షకులు సైతం అఖండ సినిమాను చూసి ఆ సినిమాకు ఫిదా అవుతున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళంలోకి డబ్ కానుంది. తమిళంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతుందో ఓటీటీలో అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతూ ఉండటం గమనార్హం. ఊరమాస్ కథాంశంతో అఖండ తెరకెక్కినా క్లాస్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది.
అయితే అఖండ తమిళంలో డబ్ అవుతున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి భారీ లాభాలను అందించింది. ఈ సినిమా సక్సెస్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ కు కూడా ప్లస్ అయిందని ప్రగ్యా జైస్వాల్ పారితోషికాన్ని ఊహించని స్థాయిలో పెంచేశారని సమాచారం. మరోవైపు బాలయ్య కొత్త సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ సక్సెస్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అఖండ సినిమా డబ్బింగ్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. బాలయ్య కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.