అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!

నందిత శ్వేత టైటిల్ పాత్ర పోషించగా చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అక్షర”. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను వేలెత్తిచూపే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ & ప్రమోషన్స్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది చూద్దాం..!!

కథ: విద్యా విధాన్ సంస్థలో ఫిజిక్స్ టీచర్ గా జాయినవుతుంది అక్షర (నందిత శ్వేత). స్కూల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకడైన శ్రీతేజ్ (శ్రీతేజ్), కాలనీలో వాల్తేర్ బాయ్స్ గా చలామణి అయ్యే శంకర్, మధునందన్, సత్యలు అనునిత్యం అక్షర వెంటపడుతుంటారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఒకేరోజు తమ ప్రేమను అక్షరకు చెబుదాం అనుకొనే తరుణంలో అక్షర అందరికీ పెద్ద షాక్ ఇస్తుంది.

ఇంతకీ అక్షర ఎవరు? వాల్తేర్ బాయ్స్ కి ఆమె ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఏమిటి? విద్యావ్యవస్థపై ఆమె చేసిన పోరాటం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “అక్షర” చిత్రం.

నటీనటుల పనితీరు: పరిచయ చిత్రం “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తోనే నటిగా తన సత్తా చాటుకున్న నందితశ్వేత ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె క్యారెక్టర్ రెగ్యులర్ గానే ఉన్నా స్క్రీన్ ప్రెజన్స్ తో వేరియేషన్ చూపించింది.

సంజయ్ స్వరూప్ నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు. అతని పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ బాగుంది. కార్పొరేట్ క్రిమినల్స్ తీరు, బాడీ లాంగ్వేజ్ ను బాగా రెసిప్రొకెట్ చేశాడు సంజయ్.

హర్షవర్ధన్ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. మధునందన్, షకలక శంకర్, సత్య, అజయ్ ఘోష్ లు కామెడీ చేయడానికి చేసిన విశ్వప్రయత్నం విఫలమైంది.

సాంకేతికవర్గం పనితీరు: సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగానే ఉన్నాయి.. నేపధ్య సంగీతం మాత్రం సీరియల్ ను తలపిస్తుంది. నగేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & డి.ఐ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.

దర్శకుడు చిన్ని కృష్ణ రైటర్ గా చాలా బేసిక్ విషయాలను కూడా పట్టించుకోలేదు. హర్ష వర్ధన్ పాత్రకు అప్పాజీ అంబరీష్ ను తండ్రిగా చూపించడం, సూసైడ్ చేసుకొని చనిపోయిన అమ్మాయి ఫాదర్ ను ఆటోడ్రైవర్ అని చెప్పడం (ఆయన ఆటో డ్రైవర్ లా ఉండదు, ఆటో నడుపుతూ ఒక్క సీన్ కూడా లేదు), మధునందన్-సత్య-శంకర్-నందిత శ్వేత కాంబినేషన్ లో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం.. ఇలా చాలా మైనస్ లు ఉన్నాయి. సినిమా మొత్తంలో సంజయ్ స్వరూప్ & నందిత శ్వేత తప్ప ఎవరికీ క్యారెక్టర్స్ అనేవి ఉండవు. సన్నివేశాల్లో అలా కనబడుతూ ఉంటారు.

థ్రిల్లర్ కి క్లైమాక్స్ & ఫ్లాష్ బ్యాక్ అనేవి చాలా కీలకం. ఈ రెంటినీ ఒడిసిపట్టుకోవడంలో చిన్నికృష్ణ గాడితప్పాడు. కథలో మంచి ఇంటెన్సిటీ ఉంది, అయితే ఆ ఇంటెన్సిటీ కథనలో మిస్ అయ్యింది. ఫస్టాఫ్ మొత్తం అనవసరమైన లవ్ & కామెడీ ట్రాక్ లతో నింపేశాడు. సెకండాఫ్ డీసెంట్ గా మొదలెట్టినా.. కాప్టివేటింగ్ గా ఉండదు. అందువల్ల “అక్షర” ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

విశ్లేషణ: “అక్షర” ఓ సాధారణ రివెంజ్ డ్రామా. అయితే.. సినిమాలో వేలెత్తిచూపిన విద్యార్ధుల సమస్యలు, విద్యా విధానం ప్రశంసనీయం. సొసైటీకి, ప్రెజంట్ జనరేషన్ కి మంచి మెసేజ్ లాంటి ఈ సినిమా ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటే మంచి హిట్ అయ్యేది. ఓవరాల్ గా.. కాస్త ఓపికతో చూడదగ్గ మెసేజ్ ఓరియెంటెడ్ సస్పెన్స్ రివెంజ్ థ్రిల్లర్ డ్రామా “అక్షర”.

రేటింగ్: 2/5

Click Here To Read In English

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus