ఓ కొత్త బృందం సినిమా మీద ప్యాషన్ తో తెరకెక్కించిన చిత్రం “అలనాటి రామచంద్రుడు”. కృష్ణవంశీ, మోక్ష జంటగా.. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమా సంస్థ విడుదల చేయడం గమనార్హం. మరి ఈ కొత్త గ్యాంగ్ తీసిన సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: స్నేహితులతో మాట్లాడడానికి సైతం మొహమాటపడే సున్నిత మనస్కుడు సిద్ధూ (కృష్ణవంశీ). అపరిచితుడితోనైనా ఆహ్లాదంగా మాట్లాడేంత అనుకువైన అందాల బొమ్మ ధరణి (మోక్ష).
ధరణి మనసును మెచ్చి ఆమెను ఇష్టపడి, సైలెంట్ గా ప్రేమిస్తుంటాడు సిద్ధూ. అయితే.. ఆ ప్రేమను చెప్పుకొనేలోపు ధరణి మనసు మరో వ్యక్తిని కోరుకుంటుంది.
ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి? ధరణి & సిద్ధూ ఎందుకు దగ్గరగా ఉన్నా దూరంగానే బ్రతుకుతారు? చివరికి ఈ సైలెంట్ లవ్ గెలిచిందా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే “అలనాటి రామచంద్రుడు”.
నటీనటుల పనితీరు: కథానాయిక మోక్ష తెరపై అందంగా కనిపించడమే కాక.. చక్కని హావభావాలతో ఆకట్టుకుంది. హుందాతనం, అల్లరి కలగలిపిన అమాయకత్వంతో అలరించింది. చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి కెరీర్ ఉంది.
కథానాయకుడు కృష్ణవంశీ నటనలో మొదటి సినిమా అనే తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు. మిగతా చోట్ల పర్వాలేదనిపించుకున్నాడు.
వెంకటేష్ కాకుమాను ఎప్పట్లానే తన టైమింగ్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ పనితనాన్ని ముందుగా మెచ్చుకోవాలి. ఒక మంచి ఆర్ట్ సినిమా స్థాయిలో ఉన్నాయి అతడి ఫ్రేమింగ్స్. ముఖ్యంగా మనాలి తదితర లొకేషన్స్ ను అతను చాలా సహజంగా తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
శశాంక్ తిరుపతి పాటలు, నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ కంటెంట్ ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి.. పాతతరం స్వచ్చమైన ప్రేమకథలను గుర్తు చేశాడు. హీరో పాత్రధారి ప్రేమను వ్యక్తపరచడానికి పడే ఇబ్బందులు, స్వచ్చమైన ప్రేమ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన విధానం, సదరు సన్నివేశాలను కంపోజ్ చేసుకున్న విధానం బాగుంది.. కథనాన్ని ఆసక్తికరంగా రాసుకోవడంలో విజయం సాధించారు.
ప్రేమకథలో, అందులోనూ ఈ తరహా కమర్షియల్ అంశాలు జొప్పించని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి చాలా కీలకం. ఈ విషయాన్ని పూర్తిగా విజయవంతం చేశారు దర్శకుడు.
విశ్లేషణ: అశ్లీలత లేని స్వచ్చమైన ప్రేమకథా చిత్రం “అలనాటి రామచంద్రుడు”. కంటెంట్ & లాజిక్కులు తో మంచి సినిమా గా నిలిచింది.
ఫోకస్ పాయింట్: ఆ కాలంలోనే ఆగిపోయిన రామచంద్రుడు!
రేటింగ్: 2/5