ఒక బిలో యావరేజ్ సినిమాకి తక్కువ రేటింగ్స్ వచ్చినప్పుడు.. ఆ సినిమా దర్శకనిర్మాతలు లేదా కీలకపాత్ర పోషించిన నటులు రివ్యూ రైటర్స్ మీద విరుచుకుపడడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఈ హడావుడిలోకి లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చారు స్టార్ కమెడియన్ అలీ. ఆయన చాన్నాళ్ల తర్వాత కాస్త చెప్పుకోదగ్గ పాత్ర పోషించిన “రాజుగారి గది 3” గత శుక్రవారం విడుదలైంది. కనీస స్థాయి కథ-కథనాలు లోపించిన ఈ చిత్రాన్ని సమీక్షకులు ఏకిపడేశారు. సినిమాకి కలెక్షన్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.
అయితే.. నిన్న పెట్టిన “రాజుగారి గది 3” సక్సెస్ మీట్ లో పాల్గొన్న అలీ మాట్లాడుతూ.. “ప్రివ్యూ షోలు చూసే జనాలు సరిగా రియాక్ట్ అవ్వరు. అన్నీ తమలోనే దాచేసుకొంటారు. అయినా సినిమా బాగుందా లేదా అనేది చెప్పడానికి డబల్యూడబల్యూ కోన్ కిస్కా గొట్టం గాళ్ళు ఎవరు?, ప్రేక్షకుల నిర్ణయం డెసిషన్ ఫైనల్ ఎప్పుడైనా” అని రివ్యూ రైటర్స్ మీద విరుచుకుపడ్డారు అలీ. గతంలో ఎన్టీఆర్ కూడా ఇదే తరహా తీవ్రమైన ధోరణిలో వ్యవహరించారు. కానీ.. ఇదే నటులు సినిమాకు పాజిటివ్ రివ్యూలు, తమ నటనకు అద్భుతమైన ప్రశంసలు దొరికినప్పుడు ఎందుకు రివ్యూల గురించి మాట్లాడరో ఇప్పటికీ ఎవరికీ అర్ధం కానీ విషయం.