నువ్ ఇలాంటి సినిమాలు ఎందుకు చేశావ్ అని నా కూతురు అడగకూడదు : అల్లరి నరేష్

  • July 8, 2020 / 12:03 PM IST

ఒక నటుడిగా అతి తక్కువ కాలంలో 50 సినిమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ రేర్ ఫీట్ తోపాటు “డిపెండబుల్ హీరో” అనే పేరు కూడా సంపాదించిన అల్లరి నరేష్ “సుడిగాడు” తర్వాత హిట్ రుచి చూడలేదు. సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు.. దర్శకుడి వైఫల్యం, కథ-కథనాల్లో కొత్తదనం కొరవడడం, లేదా సబ్జెక్ట్ జనాలకి ఎక్కకపోవడం. కానీ.. తన నటన విషయంలో మాత్రం ఎవ్వరినీ వేలెత్తి చూపనివ్వలేదు. అందుకే అన్నీ ఫ్లాపులున్నా డైరెక్టర్లు-ప్రొడ్యూసర్లు అల్లరి నరేష్ తో సినిమాలు చేయడానికి ఇప్పటికీ వెంటపడుతుంటారు. అలాంటి క్రేజ్ ఉన్న అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం “మేడ మీద అబ్బాయి”. మలయాళ చిత్రం “ఒరు వడక్కన్ సెల్ఫీ”కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం నరేష్ కెరీర్ కు చాలా కీలకం, అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొని పక్కా ప్లానింగ్ తో రేపు (సెప్టంబర్ 8న) చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. నరేష్ కు “మేడ మీద అబ్బాయి” ఎలాంటి రిజల్ట్ ను తెచ్చిపెడుతుందో రేపు తెలుస్తుంది కానీ.. ఈలోపు ఈ “మేడ మీద అబ్బాయి” చెప్పిన విశేషాలేంటో చూద్దాం..!!

కలల్లో విహరించే ఓ యువకుడి కథ..
ఈ “మేడ మీద అబ్బాయి” ఇంజనీరింగ్ లో 24 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యి.. సినిమా తీసేసి సెటిల్ అయిపోదాం అనే ఓ యువకుడి కథే ఈ చిత్రం. ఒక షార్ట్ ఫిలిమి తీసి ఫేమస్ అయిపోతే చాలు సినిమా ఆఫర్ వచ్చేస్తుందని ఫీలైపోతుంటాడు. అలాంటి కుర్రాడికి ఒక సమస్య వస్తే ఎలా ఎదుర్కొన్నాడు. మేడ మీద కూర్చొని ఎవరికి లైన్ వేశాడు అనేది సినిమాలో కీలకమైన అంశం.

ఒరిజినల్ ఫ్లేవర్ ను పాడుచేయొద్దన్న ఆలోచనతోనే..
లాస్ట్ ఇయర్ సినిమా చాలా బాగుంది అనే ఎవరో ఫ్రెండ్ చెబితే “ఒరు వడక్కన్ సెల్ఫీ” సినిమా చూశాను. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ బొప్పన్నగారు రీమేక్ చేద్దామనుకొంటున్నానని చెప్పడంతో మరోమారు సినిమా చూసా. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సౌల్ ను.. నేటివిటీ పేరుతో పాడుచేసి అనవసరమైన మార్పులు చేయడం సరికాదని భావించి మలయాళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రజిత్ కే తెలుగు వెర్షన్ డైరెక్షన్ బాధ్యతలను కూడా అప్పగించాం. మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది.

ఎప్పుడో అయిదేళ్ళ క్రితం రిజిష్టర్ చేసిన టైటిల్ ఇది..
నిజానికి “మేడ మీద అబ్బాయి” అనే టైటిల్ ను అయిదేళ్ళ క్రితం అంటే 2012లోనే కృష్ణ భగవాన్ గారు చెప్పిన ఒక కథ కోసం రిజిష్టర్ చేశాం. ఆ ప్రొజెక్ట్ సెట్స్ మీదకు రాకపోవడం, ఈ సినిమాకి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనిపించడంతో.. వెంటనే కృష్ణభగవాన్ గారిని అడిగి ఈ టైటిల్ తీసుకొన్నామ్.

పంచ్ లు వేసీ వేసీ బోర్ కొట్టింది..
నా సినిమాల్లో అస్తమానం నేనే అందరిపై పంచ్ లు వేసీ వేసీ తెగ బోర్ కొట్టేసింది. అందుకే ఈ సినిమాలో “జబర్దస్ట్” ఫేమ్ ఆదిని ప్రత్యేకంగా ఎంచుకొని.. అతను నాపై పంచ్ లు వేసేయా క్యారెక్టర్ ను డిజైన్ చేశాం. అతడి పాత్ర హిలేరియస్ గా నవ్విస్తుంది.

ఏడుస్తూ నవ్వించమనేవారు..
నేను యాక్టింగ్ కోర్స్ లో నేర్చుకొన్న మొట్టమొదటి రూల్ “ఒకర్ని ఇమిటేట్ చేయకూడదు” అని. కానీ.. నా “సుడిగాడు” సినిమా చూశాక జనాలందరూ అలాంటి స్పూఫ్ చేయండి, సినిమాలో స్పూఫ్ లేకపోతే జనాలు చూడరండి అని బ్రతిమాలో, మభ్యపెట్టో నాచేత బలవంతంగా స్పూఫ్ లు చేయించేవారు. మరీ దారుణంగా ఏడుపులో కూడా నవ్వు పుట్టాలనేవారు. ఇకపై మాత్రం స్పూఫ్ లు చేయకూడదు అని ఫిక్స్ అయ్యా.

ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ చేయాలనుకొంటున్నాను..
రొటీన్ సినిమాలు చేసి చేసి నాకు, అవి చూసి చూసి ఆడియన్స్ కు కూడా బోర్ కొట్టేసింది. అందుకే ఇకపై కాస్త విభిన్నమైన సినిమాలు చేయాలనుకొంటున్నాను. ఒక నటుడిగా నన్ను జనాలు మెచ్చే సినిమాలు చేయాలనుకొంటున్నాను.

ఇది నేను చూడబోయే 53వ శుక్రవారం..
సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు టెన్షన్ పడడం అంటే ఏంటో కూడా మర్చిపోయి చాలా కాలమైంది. నేను చూడబోయే 53వ శుక్రవారమిది. ఒక నటుడిగా నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే టెన్షన్ తప్పితే. సినిమా రిజల్ట్ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోను.

భవిష్యత్ లో నా కూతురు నన్ను ఆ ప్రశ్న అడగకూడదు..
నా కూతురికి ఇప్పుడు ఏడాది వయస్సు. నా కూతురి వయసు ప్రకారం ఇది నా మొదటి సినిమా. భవిష్యత్ లో మూడునాగేళ్ల తర్వాత తను నన్ను “నాన్న ఇలాంటి సినిమా ఎందుకు చేశావ్” అని నన్ను అడగకూడదు. అందుకే ఇకపై మంచి కథతోపాటు.. క్యారెక్టర్ కు వేల్యూ ఉన్న పాత్రలే చేయాలనుకొంటున్నాను. అస్తమానం “గమ్యం” లాంటి సినిమాలు దొరక్కపోవచ్చు.. కాకపోతే ఆ తరహాలో వైవిధ్యమైన సినిమాలు చేయాలని మాత్రం నిశ్చయించుకొన్నాను.

– Dheeraj Babu


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus