నిన్న సాయంత్రం హైద్రాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలోని అత్యంత ఘనంగా నిర్వహించబడిన “నా పేరు సూర్య” ప్రీరిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేయడం, చరణ్ ఇండస్ట్రీ గొప్పదనం గురించి 9 నిమిషాలు మాట్లాడడం, అల్లు అర్జున్ స్వయంగా “రామ్ చరణ్ స్లంప్ లో ఉన్న ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడు, దాన్ని మహేష్ బాబు కంటిన్యూ చేశాడు, “నా పేరు సూర్య”తో నేను కూడా దాన్ని కంటిన్యూ చేస్తాను” అని 11 నిమిషాల పాటు పేర్కొనడం వంటి విషయాలన్నిటికంటే.. నిన్న అందరి దృష్టినీ ఆకర్షించింది అల్లు అరవింద్ నాలుగు నిమిషాల మాటలే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నా మేనల్లుడు ముఖ్య అతిధిగా రావడం చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేసిన అల్లు అరవింద్, అదే తరుణంలో “నా పేరు సూర్య” సినిమాకి కొందరు కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్లందరికీ అభిమానులే సమాధానం చెప్పాలి. నేను గర్వపడే స్థాయిలో సినిమా వచ్చింది. నేను సినిమా చూశాను, సక్సెస్ మీట్ లో మాట్లాడతాను” అంటూ తన చిన్న ప్రసంగాన్ని ముగించిన అల్లు అరవింద్.. “నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు కొందరు” అని పేర్కొనడం చిన్నసైజు సంచలనానికి దారి తీసింది.
నిజానికి.. ఇప్పటివరకూ “నా పేరు సూర్య” సినిమాకి పెద్దగా బజ్ లేదు. టీజర్, ఆడియో సాంగ్స్ కూడా పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి. అయితే.. మొన్న విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమా మీద విపరీతమైన ఆసక్తి పెంచింది. అలాంటి సమయంలో దర్శకుడి పనితనం గురించి కానీ, సినిమా గురించి కానీ ఎవరూ ఇప్పటివరకూ ఎక్కడా నెగిటివ్ గా మాట్లాడలేదు. పైగా.. మొన్న ఫిలిమ్ ఛాంబర్ లో అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ ను “మామా” అంటూ కౌగిలించుకొన్నప్పట్నుంచి.. అప్పటివరకూ రెండు వర్గాలుగా విడిపోయిన మెగా అభిమానులు కూడా “నా పేరు సూర్య” ప్రమోషన్స్ ను సోషల్ మీడియా సాక్షిగా తమ భుజాల మీద వేసుకొన్నారు. మరి ఇలాంటి తరుణంలో, అది కూడా సినిమా రిలీజ్ ఇంకో నాలుగు రోజుల్లో ఉంది అనగా అల్లు అరవింద్ ఈ తరహా కామెంట్స్ చేయడం అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ అల్లు అరవింద్ ఎవర్ని దృష్టిలో పెట్టుకొని అలా అన్నాడు, ఇంతకీ “నా పేరు సూర్య” విషయంలో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీ ఏంటీ? అనే తెలియాలంటే అల్లు అరవింద్ స్వయంగా చెప్పాల్సిందే. ఎందుకంటే తన సినిమా మీద నెగిటివ్ ప్రోపగాండా జరుగుతున్న విషయం తనకే తెలియదనే విషయాన్ని అల్లు అర్జున్ నిన్న తన తండ్రి మాట్లాడుతున్నప్పుడు పెట్టిన బ్లాంక్ ఫేస్ తో అందరికీ అర్ధమయ్యేలా చేశాడు.