నాపేరు సూర్య ప్లాప్ తరువాత సందిగ్ధంలో పడ్డ బన్నీ ఏడాదిన్నర ఎవరితో మూవీ చేయాలో తేల్చుకోలేకపోయాడు. సుకుమార్, వేణు శ్రీరామ్ వంటి దర్శకుల స్క్రిప్ట్స్ విని హోల్డ్ లో పెట్టాడు. అనూహ్యంగా త్రివిక్రమ్ ఫ్యామిలీ డ్రామాకు పచ్చ జెండా ఊపి..రైట్ డెసిషన్ తీసుకున్నారు. అల వైకుంఠపురంలో మూవీ భారీ విజయం అందుకొని తన క్రేజ్ మరింతగా పెంచుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప మూవీ లైన్ లో పెట్టిన బన్నీ…పాన్ ఇండియాగా విడుదల చేయనున్నాడు.
ఈ మూవీ బన్నీ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం కావడంతో పాటు, బాలీవుడ్ లో విడుదల కానున్న బన్నీ మొదటి చిత్రం. బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే…కొంచెం గుర్తింపు మరియు బాలీవడ్ ప్రేక్షకులకు పరిచయం ఉండాలి. లేకపోతే మూవీలో విషయం ఉన్నా వసూళ్లు కురవవు. అల వైకుంఠపురంలో విజయం బన్నీకి ఆ మేలు చేసింది. బన్నీ డాన్సులను, నటనను బాలీవుడ్ సెలెబ్రిటీలు పొగిడి బన్నీ పేరు అక్కడ ప్రేక్షకులకు తెలిసేలా చేశారు.
ఈ గుర్తింపు రేపు పుష్ప సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కడానికి ఉపయోగపడుతుంది. మొదట్లో పుష్ప సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనే ఆలోచన బన్నీకి లేదు. అల వైకుంఠపురంలో విజయం తరువాత అందరిలాగే మనం కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.