Allu Arjun: బర్త్‌డే స్పెషల్‌: బన్నీ ఏ సినిమాలో ఏ కొత్తదనం చూపించాడంటే?

  • April 8, 2022 / 05:34 PM IST

అల్లు అర్జున్‌… టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌. ఇటీవలే పాన్‌ ఇండియా హీరోగా కూడా మారాడు. ఈ మాట చెప్పినంత ఈజీగా ఆయనేం స్టార్‌ అయిపోలేదు. దీని వెనుక ఎన్నో సినిమాల కష్టం ఉంది. ఎంతో కసి, కృషి, పట్టుదల ఉంది. అన్నింటికి మించి ప్రతి సినిమాలో కొత్తదనం చూపించి ఆకట్టుకోవాలనే తపన ఉంది. అదే ఆయన్ను ముందు స్టైలిష్‌ స్టార్‌గా, ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా మార్చింది. అయితే ఈ విషయం ఇలా చెప్పుకోవడం కంటే, ఆయన ఏ సినిమాలో ఏం స్పెషల్‌ టాలెంట్‌ చూపించాడో చూస్తే బాగుంటుంది కదా. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఆ వివరాలు ఓ లుక్కేద్దాం!

1) బన్నీ తొలిసారి వెండితెరపై కనిపించింది ‘విజేత’ సినిమాతో. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’లోనూ కనిపించాడు. అయితే బాగా నోటీస్‌ అయ్యింది మాత్రం ‘డాడీ’తో. అందులో చిరంజీవి దగ్గర శిక్షణ తీసుకునే కుర్రాడిలా కనిపించి అలరించాడు. బన్నీ డ్యాన్స్‌లో ఈజ్‌ ఎంతుంది అనే స్పెషల్‌ టాలెంట్‌ అక్కడే చూశాం.

2) ‘గంగోత్రి’తో హీరోగా తెరంగేట్రం చేశాడు. అందులో ఏముంది కొత్తదనం అంటారా? తొలి సినిమాలోనే అమ్మాయిలా వేషం వేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కానీ ఓ పాట కోసం బన్నీ స్పెషల్‌గా కనిపించి అలరించాడు. తనలోని స్పెషల్‌ ఏంటో మచ్చుకు చూపించాడు

3) ఆ తరవాతి సినిమాగా ప్రేమకథను ఎంచుకున్నాడు బన్నీ. అందరిలాగే లవర్‌బాయ్‌ అవ్వాలనుకుంటున్నాడేమో అని అనుకున్నారు. కానీ ఆ ప్రేమకథలో చాలా మెలికలు ఉన్నాయి. రెండో సినిమాకే అలాంటి కథ ఎంచుకోవడమే అతనిలో స్పెషల్‌. సినిమా ఫలితమూ అంతేలా వచ్చింది.

4) తన ముద్దు పేరు ‘బన్నీ’ని టైటిల్‌గా మార్చుకుని మాస్‌ యాక్షన్‌ సినిమా చేశాడు అల్లు అర్జున్‌. తనలోని మాస్‌ యాంగిల్‌ ఈ సినిమాతోనే బయటికొచ్చింది. దాంతోపాటు కామిక్‌ యాంగిల్‌ కూడా. ఆ తర్వాత చేసిన ‘హ్యాపీ’లో ఆ కామిక్‌నెస్‌ బాగా పండింది.

5) టాలీవుడ్‌ హీరో – సిక్స్‌ప్యాక్‌.. ఈ రెండూ కలవడం చాలా కష్టం అని అనుకునేవారంతా. అలాంటిది ‘దేశముదురు’తో బన్నీ సిక్స్‌ ప్యాక్‌ చేసి చూపించాడు. ఇది ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు షాకే. దాంతోపాటు ఆ మ్యాన్లీ, మాస్‌ లుక్‌ బన్నీలో స్పెషల్‌గా కనిపించాలి.

6) మాస్‌ హీరోగా దూసుకుపోతాడు అనుకుంటున్న సమయంలో ‘పరుగు’ లాంటి స్లో సినిమా చేశాడు అల్లు అర్జున్‌. బన్నీకి కాస్త డబుల్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్స్‌ కష్టం అని పుకార్లు వస్తున్న సమయంలో ఈ సినిమా వచ్చిన వాళ్లతో నోళ్లు మూయించింది అని చెప్పాలి.

7) నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరో పాత్ర చేయాలి అంటే హీరోలు కాస్త జంకుతారు. కానీ ‘ఆర్య 2’ కోసం ఆ పనే చేశాడు బన్నీ. ఫ్రెండ్‌షిప్‌ కోసం, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, ప్రాణాలు తీయడానికైనా సిద్ధమయ్యే పాత్ర అది. ఇలాంటి పాత్రకు ఓకే అనాలంటే చాలా ధైర్యం కావాలి. అది బన్నీ దగ్గరుంది.

8) ‘ఆర్య 2’ లాంటి జెట్‌ స్పీడ్‌ సినిమా విజయాన్ని ఇవ్వలేదు. అలాగే ఆ తర్వాత వచ్చిన కూల్‌ అండ్‌ కామ్‌ ‘వరుడు’ కూడా అదే పని చేసింది. కథలో భాగంగా ఉండే పాత్రలు మన హీరోలు అంతగా నచ్చరు అంటారు. ఎలివేషన్లు సరిగ్గా ఉండవనే ఆలోచనతోనే అలా అంటుంటారట. కానీ ‘వరుడు’ లాంటి సినిమా ఓకే చేసిందీ బన్నీనే. ఫలితం సంగతి పక్కన పెడదాం.

9) అల్లు అర్జున్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ రోల్స్‌ అనే లిస్ట్‌ రాయమంటే అందులో కేబుల్‌ రాజు పాత్ర టాప్‌లోనే ఉంటుంది. అంత మంచి పాత్ర అది. ‘వేదం’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర అది. డబ్బులు కొట్టేసే సీన్‌, తిరిగి అప్పగించే సీన్స్‌, క్లైమాక్స్‌లో బన్నీ క్యారెక్టర్‌ ఐకాన్‌ లెవల్‌.

10) ట్రెండ్‌ను ఫాలో అయ్యి చేసిన ‘బద్రినాథ్‌’ దారుణ పరాజయం పాలవ్వగా… త్రివిక్రమ్‌తో చేసిన ‘జులాయి’ అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ కామిక్‌ టైమింగ్‌ కేక అనొచ్చు. ఆ తర్వాత ‘ఇద్దరమ్మాయిలతో’తో సినిమా పరాజయం పాలైనా… లుక్‌, ఫీల్‌ మాత్రం సూపర్‌ ఉంటాయి. యాటిట్యూడ్‌లో కొత్త బన్నీ కనిపిస్తాడు

11) పాత్ర కనిపించేది కాసేపయినా, ఆ ఫీల్‌ మాత్రం సినిమా మొత్తం ఉంటుంది. ఏ సినిమానో తెలుసుగా ‘ఎవడు’లో. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న పాత్ర ఒప్పుకోవడం పెద్ద విషయమే కదా.

12) కమర్షియల్‌ కథకు కామెడీతో అదరగొట్టే సినిమా కావాలంటే ‘రేసు గుర్రం’ చూడొచ్చు. అంతలా అందులో బన్నీ మెరిపించాడు. కామిక్‌ టైమింగ్‌, యాక్షన్‌ లుక్‌ ఆ సినిమాలో వావ్‌ అనిపిస్తాయి

13) సెటిల్డ్‌ పాత్రలు చేయాలంటే ‘వరుడు’తో భయపడ్డాడు బన్నీ. కానీ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’తో తిరిగి ఆ ప్రయోగం చేశాడు. ఇందులో బన్నీ యాటిట్యూడ్‌ కొత్తగా ఉంటుంది. ఎలాంటి పాత్ర అయినా సెట్‌ అయిపోతా అని ఈ సినిమాతో మరోసారి నిరూపించాడు.

14) ఇందాక చెప్పుకున్నాం కదా… బన్నీ టాప్‌ మూవీ క్యారెక్టర్స్‌ లిస్ట్‌ అని. అందులో టాప్‌లో ఉండే మరో పేరు ‘గోన గన్నారెడ్డి’. ‘రుద్రమదేవి’ సినిమాలో ఈ పాత్ర చేశాడు. ఈ పాత్ర యాస అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు అవార్డులు కూడా. ఈ పాత్రను ఓకే చేయాలన్నా, నటించాలన్నా అంత ఈజీ కాదు.

15) ఫుల్‌ మాస్‌ సినిమా చేసి చాలా రోజులు అయ్యింది అనేమో… ‘సరైనోడు’ చేశాడు బన్నీ. బోయపాటి స్టైల్‌లో బన్నీ అనేసరికి అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు కొత్త బన్నీ కూడా కనిపించాడు. మాస్‌ సినిమాలు సరైనోడే అనిపించుకున్నాడు కూడా.

16) ‘డీజే’… ‘దువ్వాడ జగన్నాధం’. ఈ సినిమాలో బన్నీ రెండు లుక్స్‌లో కనిపిస్తాడు. దేనికదే భిన్నం. కానీ రెండింటినీ అదరగొట్టాడు. అంత మోతాదు యాక్షన్‌, క్లాస్‌, స్టైల్‌ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేశాయి.

17) బన్నీ కెరీర్‌లో బాగా కష్టపడి, హైప్‌ వచ్చి దారుణ పరాజయం పొందిన సినిమా అంటే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చెప్పాలి. పాత్ర లుక్‌ నుండి, యాటిట్యూడ్‌ వరకు అన్నీ మార్చుకున్నాడు. కానీ సినిమా ఆశించినంతగా ఆడలేదు. కానీ బన్నీ కష్టం మాత్రం మెచ్చుకోదగ్గదే.

18) దారుణమైన పరాజయం… చాలా నేర్పిస్తుంది అంటుంటారు పెద్దలు. ఆ నేర్పిన విషయాలతో ‘అల వైకుంఠపురములో’ చేశాడు. ఈ సినిమా సమయంలో తన తప్పుల నుండి నేర్చుకున్న విషయాలు ఆచరణలో పెట్టాడు. ఆ విషయం బహిరంగంగానే చెప్పి… తప్పును ఎలా ఒప్పుకోవాలో చూపించాడు.

19) ఇక లేటెస్ట్‌ సెన్సేషన్‌ అంటే ‘పుష్ప’. ఈ పాత్ర కోసం బన్నీ పడ్డ కష్టం, చేసిన శ్రమ ఇవన్నీ చూసే దర్శకుడు సుకుమార్‌ ఐకాన్‌ స్టార్‌ అని పేరు మార్చేశాడు. ఆ సినిమా కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ ఏడాది రాబోయే ‘పుష్ప 2’ గురించి వెయిట్‌ చేయడమే.

ఈలోపు మరోసారి బన్నీకి హ్యాపీ బర్త్‌డే చెబుదాం. ఆల్‌ ది బెస్ట్‌ కూడా.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus