టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించారు. పుష్ప-2 తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందని టీ సిరీస్ సంస్థ వెల్లడించడంతో అంచనాలు హై రేంజ్ లోకి వెళ్లాయి. బన్నీ నటనకు, వంగా రా మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడ్డారు.
కానీ ఆ ప్రకటన వచ్చి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఆ సినిమా అసలు ఉందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి తోడు బన్నీ తన తర్వాతి ప్రాజెక్టులను వరుసగా లైన్లో పెడుతుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరు వరకు సాగే అవకాశం ఉంది.
అట్లీ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. 2026లో ఈ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అనుకున్న సినిమాపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిందని అంటుంటే, మరికొందరు ఇంకా చర్చల దశలోనే ఉందని చెప్తున్నారు. ఏదేమైనా రాబోయే రెండు మూడేళ్ల వరకు బన్నీ డైరీ ఫుల్ గానే కనిపిస్తోంది.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా తన తర్వాతి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా పనుల్లో ఉన్న ఆయన, ఆ తర్వాత రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ చేయాల్సి ఉంది. వీటి అనంతరం మహేష్ బాబు లేదా రామ్ చరణ్‌తో కూడా సినిమాలు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఇద్దరు స్టార్స్ తమ తమ కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో వీరిద్దరి కాంబో సినిమా ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో వీరిద్దరి మధ్య ఏదైనా చర్చలు జరిగి సినిమా అప్‌డేట్ ఇస్తారేమో వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్ళినట్లే అనిపిస్తోంది.