అతనికంటే చిన్న హీరోనేం కాదు

  • February 22, 2018 / 05:45 AM IST

ఒకప్పుడు చిత్రపరిశ్రమ టాలెంట్, లక్, హార్డ్ వర్క్ వల్ల నడిస్తే.. కాలక్రమేణా వాటి స్థానంలో ‘ఈగో’ వచ్చి చేరింది. ఈ ‘ఈగో’ వల్ల రూపాయి కాదు కదా కనీసం పైసా లాభం లేకపోయినా, లెక్కలేనన్ని అనర్ధాలకు మాత్రం కేంద్రబిందువుగా మారింది. ప్రస్తుతం ఆ “ఈగో” కారణంగా ఇండస్ట్రీకి వెన్నుముక లాంటి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వెన్నులో చలి పుడుతోంది. ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే.. వారి అభిమానుల కంటే ఎక్కువగా సంతోషించేది డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్లే. కానీ.. మొట్టమొదటిసారిగా ఒకే విడుదల తేదీ కోసం ఇద్దరు స్టార్ హీరోలు కోల్డ్ వార్ చేసుకొంటుండడం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భయాన్ని కలిగిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలూ మాస్, క్లాస్ లో సమానమైన క్రేజ్ ఉన్నోళ్లే. హిట్ టాక్ వస్తే ఇద్దరి సినిమాలూ వందల కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఉన్నవే. అలాంటి సమానమైన క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం అనేది సదరు హీరోల ప్రచ్చన్న యుద్ధానికి, గెలిస్తే ఈగో సాటిస్ఫై చేసుకోవడం వరకూ ఉపయోగపడుతుంది కానీ.. మార్కెట్ పరంగా ఈస్థాయి లాస్ తెస్తుందో లెక్క కూడా వేయలేం.

మహేష్ బాబు – అల్లు అర్జున్ ల తాజా చిత్రాలైన “భరత్ అనే నేను, నా పేరు సూర్య” విడుదల తేదీల నడుమ జరుగుతున్న రచ్చ ఇందుకు కారణం. ముందు ఏప్రిల్ 27న వద్దామనుకొన్న ఈ ఇద్దరు.. మళ్ళీ ఏమనుకొన్నారో ఏమో కానీ రజనీకాంత్ “కాలా” కోసం ఏప్రిల్ 27ను వదిలేసి, ఒకరోజు ముందు అనగా “ఏప్రిల్ 26″కి కూడా ఇద్దరూ కలిసి జరిగారు. ఇలా ఒకరిపై ఇంకొకరు ఎందుకు పోటీకి దిగుతున్నారో అర్ధం కాక ఈ పోటీని తప్పించడం కోసం కొందరు ఇండస్ట్రీ పెద్దలు పూనుకొన్నప్పటికీ పరిష్కారం లభించలేదు. పైగా హీరోలను సంప్రదించగా.. “నేనేం అతనికంటే చిన్న హీరోను కాదు, అలాంటప్పుడు నేనెందుకు నా రిలీజ్ డేట్ ను మార్చుకోవాలి” అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. దాంతో రాజీ కోసం వెళ్ళిన పెద్దలు కూడా మారు మాట్లాడకుండా వెనుతిరుగుతున్నారట. ఈ ఇద్దరు స్టార్ హీరోల మరియు సదరు చిత్రాల దర్శకనిర్మాతల “ఈగో”ల వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేకపోయినా, బిజినెస్ ట్రేడ్ మాత్రం నష్టపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఈ నష్టాల్ని బేరీజు వేసుకొని విడుదల తేదీల్లో మార్పులేమైనా తీసుకొస్తారో లేక “ఈగో”కే అగ్రతాంబూలమిచ్చి ఒకేరోజున వస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus