గోపీచంద్ హీరోగా రూపొందిన “ఆక్సిజన్” చిత్ర దర్శకుడు ఎం.జ్యోతికృష్ణ అని చెబితే గబుక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ.. తరుణ్-త్రిష జంటగా నటించిన “నీ మనసు నాకు తెలుసు” అనే సినిమాకి కూడా ఈయనే దర్శకుడు అంటే మాత్రం ఈజీగా గుర్తుపడతారు జనాలు. ఆ సినిమా హిట్టవ్వకపోయినా.. రెహమాన్ సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్. మధ్యలోనూ “కేడీ” అనే సినిమాకి దర్శకత్వం వహించినప్పటికీ ఆ సినిమా రిలీజవ్వకపోవడంతో జ్యోతికృష్ణ డైరెక్టర్ గా ప్రేక్షకుల్ని పలకరించి పద్నాలుగేళ్లవుతోంది. ఇంత భారీ గ్యాప్ అనంతరం జ్యోతికృష్ణ డైరెక్షన్ లో రూపొందిన “ఆక్సిజన్” ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన జ్యోతికృష్ణ “ఆక్సిజన్” గురించి చెప్పిన విశేషాలు మీకోసం..!!
ఆ లేట్ కు కారణం గ్రాఫిక్సే..
“ఆక్సిజన్” సినిమా గురించి అందరూ అడుగుతున్న ఏకైక విషయం ఇంత లేట్ ఎందుకు అయ్యింది అనే. అయితే.. షూటింగ్ లేట్ అవ్వడమో లేక మరింకేదో కారణం కాదు. ఎనిమిది నెలల క్రితమే సినిమా కంప్లీట్ అయిపోయింది. సినిమాలోని 17 నిమిషాల గ్రాఫిక్స్ చేయడం బాగా లేట్ అయ్యింది. ఒక ముంబై సంస్థకు గ్రాఫిక్ వర్క్ చేయమని ఇచ్చాం. వాళ్ళేమో రియలిస్టిక్ గా ఉండడం కోసం దాదాపు 6 నెలల టైమ్ తీసుకొన్నారు. దాంతో సినిమా బాగా లేట్ అయ్యింది. అయితే.. సినిమా లేట్ అవ్వడం కూడా నాకు పనిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ గ్యాప్ లో సినిమాని బాగా పాలిష్ చేశాను.
మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్..
అసలు “ఆక్సిజన్” అంటే ఏమిటి, టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే.. నేటి సమాజానికి చాలా అవసరమైన సందేశంతోపాటు మాస్ ఆడియన్స్ మెచ్చే కమర్షియల్ అంశాలన్నీ పుష్కలంగా ఉన్న చిత్రమిది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి మెదడులో “దేశం కోసం ఏమైనా చేయాలి” అనే ఆలోచన వస్తుంది.
మొదట్లో గోపీచంద్ గారు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు..
నిజానికి నేను మూడేళ్ళ క్రితమే ఈ కథ రాసుకొన్నాను. అయితే.. మొదట్లో గోపీచంద్ గారి కోసం ట్రై చేసినప్పుడు ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత అజిత్ తో “వేదాలమ్” చేస్తున్నప్పుడు మా డైరెక్టర్ శివ ఆల్రెడీ గోపీచంద్ గారితో “శౌర్యం, శంఖం” చిత్రాలు తీసి ఉండడంతో తనకున్న పరిచయంతో గోపీచంద్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసారు. ఆ తర్వాత గోపీ గారికి కథ విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వచ్చింది.
మొత్తం ఆరుగురు కెమెరామెన్లతో వర్క్ చేశాం..
ఏ సినిమాకైనా మహా అయితే ఇద్దరు లేదంటే ముగ్గురు కెమెరామెన్లు వర్క్ చేసి ఉంటారు. కానీ.. మా “ఆక్సిజన్” చిత్రానికి ఏకంగా ఆరుగురు కెమెరామెన్లు వర్క్ చేశారు. కీలకభాగాలను వెట్రి షూట్ చేయగా, మిగతా పార్ట్శ్ ను ఛోటా కె.నాయుడు, శ్యామ్ కె.నాయుడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు.
టైమ్ కుదరకపోవడంతో యువన్ కి బదులు చిన్నా చేశారు..
సినిమా షూటింగ్ ఆర్టిస్ట్స్ ఎవైలబిలిటీ వల్ల కాస్త లేట్ అవ్వడంతో.. యువన్ శంకర్ రాజాకి సినిమాకి నేపధ్య సంగీతం అందించే టైమ్ దొరకలేదు. దాంతో.. చిన్నాగారు రంగంలోకి దిగి.. దాదాపు రెండున్నర నెలలు శ్రమించి ఈ చిత్రానికి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.
ఆయనకి నచ్చిందన్న విషయం నాకు మాత్రం చెప్పలేదు..
నేను కథ రాసుకొన్నానన్న విషయం ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. మొదటసారి గోపీచంద్ గారు కథ విన్నాక మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత ఆయన కథ విని ఎటువంటి మార్పులు చెప్పకుండా ఒకే చేశారు. అలాగే.. సినిమా చూశాక.. ఆ సీన్ ఇలా తీస్తే బాగుంటుంది, ఈ సీన్ ఇలా తీస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారే కానీ.. ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. కానీ.. ఒకరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వెళ్లినప్పుడు అక్కడ తెలిసిన ప్రొడ్యూసర్స్ అందరూ “సినిమా చాలా బాగుందట కదా.. మీ నాన్నగారు చెప్పారు. మీ నాన్నగారికి నచ్చితే ప్రపంచానికి నచ్చినట్లేనన్నారు”. ఆ మాట విన్నాక నాకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది.
ఆవిడే నా బిగ్గెస్ట్ క్రిటిక్..
నా సినిమాలకు నా వైఫ్ బిగ్గెస్ట్ క్రిటిక్. అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా మొహం మీదే రిజల్ట్ చెప్పేస్తుంది. అందుకే ఈ సినిమా మా ఆవిడకి చూపించాను. బాగోదని చెప్తుందేమో అనుకొన్నాను కానీ.. చాలా బాగుంది అని చెప్పడంతో కాస్త షాక్ అయ్యాను.
మా బ్యానర్ లో ఇదే మొదటిసారి..
అసలు మా బ్యానర్ లో తెరకెక్కిన సినిమాల్లో ఒక్క సినిమా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించింది లేదు. అసలు “వేదాలమ్” సినిమా అయితే కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా విడుదల చేసేశామ్. కానీ.. “ఆక్సిజన్” సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదాపడడంతో.. కేవలం డిస్ట్రిబ్యూటర్స్ కోసం రెండు షోలు వేశాం. అందరూ యునానిమస్ గా సినిమా సూపర్ హిట్ అని డిక్లేర్ చేసి వెంటనే రిలీజ్ చేద్దామన్నారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన చిత్రాన్ని నవంబర్ 30న విడుదల చేద్దామని ఫిక్సయ్యి ప్రమోషన్స్ మొదలెట్టామ్.
కంటెంట్ ఇంపార్టెంట్, టెక్నాలజీ కాదు..
నేను తీసిన సినిమా హిట్ అనే విషయం నాకు తెలుసు.. అది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే విషయం మాత్రం నవంబర్ 30న తెలుస్తుంది. అయితే.. సినిమాలో ఆడియన్స్ ను ఆకట్టుకొనే కంటెంట్ ఏమిటి అని అడిగితే మాత్రం మనసుల్ని హత్తుకొనే కథనం అనే చెప్పగలను. అయినా ఈమధ్య ప్రేక్షకులు టెక్నాలజీ పట్టించుకోవడం లేదు. కేవలం కంటెంట్ లో ఉన్న ఎమోషన్ కి మాత్రమే కనెక్ట్ అవుతున్నారు. ఆ పరంగా చూసుకుంటే “ఆక్సిజన్” సూపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ.
సంక్రాంతి తర్వాత పవర్ స్టార్ తో సినిమా షురూ..
ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మా బ్యానర్ లో “వేదాలమ్” తెలుగు రీమేక్ ను మొదలెట్టిన విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందేమో అని అందరూ అనుకొంటున్నారు. అయితే.. ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాయి. జనవరి ద్వితీయార్ధంలో సినిమా మొదలవుతుంది.
– Dheeraj Babu