అమావాస్య

  • February 8, 2019 / 01:33 PM IST

సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కమ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ సచిన్ జోషి నటించిన తాజా చిత్రం “అమావాస్య”. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ హారర్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి కథానాయికగా నటించింది. భూషణ్ పటేల్ తెరకెక్కించిన ఈ చిత్రంతోనైనా కథానాయకుడిగా ఒక్క హిట్ అయిన కొట్టాలన్న సచిన్ జోషి జీవిత ధ్యేయం నెరవేరిందో లేదో చూద్దాం..!

కథ:  ప్రేమించి పెళ్లి చేసుకొని సరదాగా ఎంజాయ్ చేయడం కోసం తన భార్య ఆహానా (నర్గీస్)ను తీసుకొని విదేశాలకు వెళ్తాడు కరణ్ (సచిన్ జోషి). అక్కడ ఒక విల్లాలో స్టే చేస్తారు. మొదట్లో అంతా బాగానే ఉంటుంది కానీ.. కొన్ని రోజులకే అక్కడ విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి ఆహానా & కరణ్ జంటకి. అందుకు కారణం మాయ అనే ఆత్మ అని తెలుసుకొంటారు ఇద్దరూ. ఆ మాయ ఎవరు? కరణ్-ఆహానా జంటను ఎందుకు ఇబ్బందిపెడుతుంది? చివరికి ఏమైంది? అనేది “అమావాస్య” కథాంశం.

నటీనటుల పనితీరు: మాయ అనే దెయ్యం పాత్ర పోషించిన కొత్త నటి మినహా ఒక్కరు కూడా కనీసం ఆకట్టుకోదగ్గ నటనతో ప్రేక్షకుల్ని అలరించలేకపోయారు. సచిన్ జోషి విగ్రహపుష్టి అన్నట్లు వెండితెర నిండా కనిపించాడే తప్ప ఒక్కటంటే ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా పండించలేకపోయాడు. ఇక నర్గీస్ ఫక్రి చూడ్డానికి బాగానే ఉన్నా.. అమ్మడి హావభావాలు సహనం పరీక్షిస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు: గ్రాఫిక్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ లేదా ప్రశంసించదగ్గ అంశం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అసలే మూస కథ, దానికి తోడు నీరసం తెప్పించే కథనం.. ఇక అవి సరిపోవు అన్నట్లు నటీనటుల అద్భుతమైన నట ప్రదర్శనలు. అన్నీ కలగలిసి “అమావాస్య” చిత్రాన్ని ఒక బోరింగ్ మూవీగా మిగిల్చాయి.

విశ్లేషణ: సచిన్ జోషి వీరాభిమానులు అయితే మాత్రమే “అమావాస్య” చిత్రాన్ని థియేటర్లో చూడగలరు. లేదంటే మాత్రం మీ ఇష్టం.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus