థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్

సినీ రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవం నిర్మాతలకు సినిమా నిర్మాణ ఖర్చుని తగ్గించడమే కాదు.. కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. అయితే అది మరో రూపంలో నష్టాన్ని కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇదివరకు సినిమా థియేటర్లో వందరోజులు పూర్తి అయిన తర్వాత శాటిలైట్ రైట్స్ లావాదేవీలు మొదలయ్యేవి. ఇప్పుడు మూవీ సెట్స్ మీద ఉండగానే రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు సినిమా థియేటర్లో 50 రోజులు కూడా పూర్తి చేసుకోకముందే టీవీల్లో ప్రత్యక్షమవుతోంది. దీంతో థియేటర్ కలక్షన్స్ తగ్గిపోతోంది. ఇప్పుడు థియేటర్స్ ఆదాయానికి గండి కొట్టే కొత్త విధానం వచ్చింది. అదే అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు. ఈ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ లు భారీ ధరకు సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. సినిమా థియేటర్లో ఉన్న సంగతిని పక్కన పెట్టి తాము అనుకున్న టైమ్ ని నెట్లో సినిమాని పెడుతున్నాయి.

రీసెంట్ గా నాని హీరోగా నటించిన “ఎంసీఏ” థియేటర్స్‌లో బాగా నడుస్తుండగానే స్ట్రీమింగ్ వెబ్‌సైట్ లో దర్శనమిచ్చింది. నిర్మాత దిల్ రాజు నుంచి హక్కులు కొన్న అమేజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాను నెట్‌లో ఉంచింది. గతంలో “జవాన్” సినిమా కూడా విడుదలైన 28వ రోజునే “అమెజాన్ ప్రైమ్లో” ప్రసారమైంది. స్ట్రీమింగ్ వెబ్‌సైట్ నిర్వాహకులు చిత్ర నిర్మాతల నుంచి రైట్స్ తీసుకునేటప్పుడే నెలరోజుల్లోపు ప్రసారం చేస్తామనే బాండ్ తీసుకుంటున్నారు. భారీ మొత్తం ఆఫర్ చేస్తుండడంతో నిర్మాతలు సైతం అంగీకరిస్తున్నారు. కోట్లు పోసి పంపిణి హక్కులు కొన్న డిస్టిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు నష్టపోతున్నాయి. శాటిలైట్ హక్కులు కొనుక్కున్న టీవీ ఛానల్స్ ఆదాయం కూడా తగ్గిపోతోంది. మరి ఈ సమస్యకి సినీ పెద్దలు ఎటువంటి పరిష్కార మార్గాన్ని సూచిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus