అమేజాన్ ప్రైమ్ సంస్థ నిర్మించిన తాజా ఒరిజినల్ “అమ్ము”. ఐశ్వర్యలక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 19 నుంచి ప్రైమ్ యాప్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. ట్రైలర్ తో విశేషంగా ఆకట్టుకున్న ఈ కాన్సెప్ట్.. సినిమాగా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: ఎన్నో ఆశలతో పక్కింటి కుర్రాడు రవీంద్రనాధ్ (నవీన్ చంద్ర)ను పెళ్లి చేసుకుని.. కొత్త సంసారం మొదలెడుతుంది అమ్ము (ఐశ్వర్యలక్ష్మి). తొలుత అంతా బాగానే ఉంటుంది. భర్త ఎక్కడలేని ప్రేమ కురిపిస్తుంటాడు. కానీ.. మెల్లమెల్లగా తన భర్తలోని చీకటి కోణం బయటపడుతుంటుంది. అప్పటివరకూ తన చుట్టూ ఉన్నది ఒక భ్రమ మాత్రమేనని గ్రహించిన అమ్ము ప్రపంచం కూడా చీకటవుతుంది. తనకు శారీరికంగా, మానసికంగా హింసించే భర్త నుండి తప్పించుకోవడమే కాక.. అతడి నిజస్వరూపం ప్రపంచానికి ఎలా తెలియజేయాలా? అని ఆలోచిస్తున్న అమ్ముకి దొరికిన ఆయుధం ప్రభు (బాబీ సింహా). ప్రభును వినియోగించుకుని.. తన భర్త రవీంద్రకు అమ్ము ఎలా బుద్ది చెప్పింది? అనేది “అమ్ము” కథాంశం.
నటీనటుల పనితీరు: ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ తో నవీన్ చంద్ర ఆశ్చర్యపరిచాడు. కొన్ని ఫ్రేమ్స్ & సీన్స్ లో “కుంబలాంగి నైట్స్”లో ఫహాద్ నటనను ఇమిటేట్ చేసినప్పటికీ.. శాడిస్టిక్ హజ్బెండ్ గా మాత్రం అదరగొట్టాడు. నిజంగానే ఆడాళ్ళు తిట్టుకొనే స్థాయిలో పాత్రలో జీవించేశాడు నవీన్ చంద్ర. అతడి కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా ఈ చిత్రంలో రవి పాత్ర నిలిచిపోతుంది.
అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి సగటు మహిళను తలపిస్తుంది. చాలా సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. మన ఇంట్లో ఆడపడుచును చూస్తున్న భావన కలుగుతుంది. ముఖ్యంగా.. బస్టాండ్ లో ఏడ్చుకుంటూ తనను తాను ఓదార్చుకునే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది.
అయితే.. క్యారెక్టరైజేషన్ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఉండి ఉంటే పాత్ర ఇంకాస్త బాగా ఎలివేట్ అయ్యి, కనెక్ట్ అయ్యేది. బాబీ సింహా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: కెమెరా ఉమెన్ అపూర్వ శాలిగ్రామ్ పనితనం సినిమాకి మెయిన్ ఎస్సెట్. సినిమాలోని ఎమోషన్ కు తగ్గట్లుగా సినిమా టోన్ ను కంట్రోల్ చేసిన విధానం బాగుంది. అలాగే.. హీరోయిన్ ఇన్ఫీరియర్ పర్సనాలిటీని లైటింగ్ తో కన్వే చేసిన విధానం కూడా బాగుంది.
భరత్ శంకర్ సంగీతం తెలుగు నేటివిటీకి సింక్ అవ్వలేదు, అలాగే.. తెలుగు అనువాద సాహిత్యం కూడా సదరు ఎమోషన్ ను ఎలివేట్ చేయలేకపోయింది. సినిమాకి ఒన్నాఫ్ డి మైనస్ ఇది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగున్నాయి.
దర్శకుడు చారుకేశ్ ఒక సాధారణ కథను అసాధారణంగా చెప్పాలనుకునే ప్రయత్నం అభినందనీయం. అయితే.. కథనం విషయంలో మాత్రం తడబడ్డాడు. గృహహింస కాన్సెప్ట్ కు పోలీస్-దొంగ చేజ్ ను నేపధ్యంగా ఎంచుకుని ట్రైలర్ పరంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినప్పటికీ.. సినిమాగా మాత్రం అలరించలేకపోయాడు. ఒకానొక సందర్భంలో మరీ ఇంత సింపులా అనిపిస్తుంది. అలాగే.. క్లైమాక్స్ ను కన్సీవ్ చేసిన విధానం బాగోలేదు. ఈ రెండు విషయాల్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఇంకో రేంజ్ కి వెళ్ళేది.
విశ్లేషణ: మగాడిలో మృగాడిని భరించాల్సిన అవసరం భార్యకు లేదు అని ప్రూవ్ చేసే ప్రయత్నమే “అమ్ము”. ఒటీటీ రిలీజ్ కాబట్టి, ల్యాగ్ & రిపీటెడ్ సీన్స్ ను ఫార్వార్డ్ చేసుకునే సౌలభ్యం ఉంది కాబట్టి.. నవీన్ చంద్ర నటన, ఐశ్వర్య లక్ష్మి స్క్రీన్ ప్రెజన్స్ కోసం ఒకసారి చూడదగ్గ చిత్రం “అమ్ము”.
రేటింగ్: 2/5