Sr NTR: ఎన్టీఆర్‌ని కథానాయకుడి నుండి ప్రజా నాయకుడిగా మార్చిన సినిమా..!

  • October 27, 2022 / 11:47 PM IST

నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలున్నాయి. ఆయన రాజకీయాల్లోకి రావడానికి సినిమాలు చాలా హెల్ప్ అయ్యాయి. ‘మనదేశం’ తో మొదలైన ఎన్టీఆర్ ప్రస్థానం ‘తెలుగుదేశం’ వరకు రావడానికి కొద్దిరోజుల ముందు తారక రాముడు నటించిన ‘నాదేశం’ మూవీ విడుదలై సంచలనం సృష్టించింది. 1982 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘నాదేశం’ 2022 అక్టోబర్ 27 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఎన్టీఆర్‌ని కథానాయకుడి నుండి ప్రజా నాయకుడిగా మార్చిన చిత్రమిది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలేంటో చూద్దాం..

ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ప్రజల్ని చైతన్య పరచడానికి, పార్టీని బలోపేతం చెయ్యడానికి తక్కువ టైం మాత్రమే ఉంది. మరోవైపు ‘మీకు సినిమా చేస్తున్నాం’ అని ఎన్టీఆర్ మాటిచ్చిన నిర్మాతలు క్యూలో ఉన్నారు. దేవీ ఫిలిమ్స్, దేవి వర ప్రసాద్, పల్లవి ఫిలిమ్స్, వెంకటరత్నం, చిన్నికృష్ణా మూవీస్ కృష్ణంరాజులను పిలిచి ముగ్గురూ కలిసి ఓ సినిమా చేసుకోమని డేట్స్ ఇచ్చారాయన . దీంతో కె. బాపయ్య దర్శకత్వంలో… పల్లవి దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ‘నా దేశం’ సినిమాకి శ్రీకారం చుట్టారు.

హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘లావారిస్’ సినిమా రైట్స్ కొని ఈ సినిమాని రీమేక్ చేశారు దర్శక నిర్మాతలు. ‘నాదేశం’ సినిమాకు పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీ తగ్గట్టు మార్పులు, చేర్పులు చేశారు. థియేటర్లలో పరుచూరి సోదరులు రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది?.. ఎప్పటిలానే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి చెలరేగిపోయారు. క్లైమాక్స్‌లో నటరత్న చెప్పిన డైలాగులు జనాల్లోకి చొచ్చుకుని పోయాయి. కె.చక్రవర్తి స్వరపరచిన పాటలు ప్రజాదారణ పొందాయి. 1982 జూలై 22న హైదరాబాద్‌లో ‘నాదేశం’ షూటింగ్ ప్రారంభమైంది. కేవలం 17 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది.

ఎన్టీఆర్ 16 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ మూవీ బడ్జెట్ 40 లక్షలు. కోటి రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్ నెలకొల్పింది. ‘నాదేశం’ విడుదలైన 70 రోజులకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత నెల రోజులకు 10 కేంద్రాల్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. అలా ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసిన చిత్రంగా ‘నాదేశం’ కి ప్రత్యేకత ఉంది. 1982లో ఆయన నటించిన ‘నాదేశం’, ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలిపులి’ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అవడంతో పాటు తారక రాముడి పొలిటికల్ కెరీర్‌కి ప్రాణం పోశాయి అని చెప్పొచ్చు..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus