అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో క్రిష్ తెరకెక్కిన ‘వేదం’ చిత్రం విడుదలయ్యి ఈరోజుతో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ‘ఆర్కా మీడియా వర్క్స్’ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 4 2010 లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకున్నా పెద్దగా ఆడలేదు. కానీ ‘వేదం’ కచ్చితంగా ఓ మంచి చిత్రం అని మాత్రం ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఇదే చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశారు. వేశ్య సరోజా పాత్రలో అనుష్క, కేబుల్ రాజు పాత్రలో అల్లు అర్జున్, రాక్ స్టార్ వివేక్ గా మంచు మనోజ్ అద్భుతంగా నటించిన ఈ చిత్రం కథ ఎలా పుట్టింది అనే విషయాన్ని క్రిష్ ఇటీవల ఓ సంధర్భంలో చెప్పుకొచ్చింది.
‘గమ్యం’ చిత్రం తర్వాత క్రిష్ ఓ కమర్షియల్ సినిమా చేద్దాం అనుకున్నాడట. ‘ఆ టైములో ఉండవల్లి గుహలను చూడటానికి వెళ్ళారట. అక్కడ ఓ చిన్న పిల్లాడు ఓ వృద్ధుడు వేలు పట్టుకుని లాక్కెళ్లడం చూసి… ఆ దృశ్యాన్ని ఫోటో తీసారట. అక్కడ స్టార్ట్ అయ్యిందట ‘వేదం’ ప్రయాణం. ‘ఓ చిన్నపిల్లాడు వెట్టిచాకిరి చేస్తాడు’ అనే లైన్ పై కథ రాయడం మొదలు పెట్టాడట క్రిష్. ఆ తరువాత కేబుల్ రాజు, వేశ్య సరోజ, రాక్ స్టార్ వివేక్ పాత్రలను డిజైన్ చేసాడట. ‘గమ్యం’ తరువాత ఓ రోజు బన్నీ క్రిష్ కు ఫోన్ చేసి భోజనానికి వెళ్దాం అని అడిగాడట.
అలా తినడానికి వెళ్ళినప్పుడు కేబుల్ రాజు పాత్ర గురించి చెప్తే ఈ పాత్ర నేనె చేస్తాను… అని చెప్పాడట. తరువాత కథ పూర్తిగా చెప్పగా బన్నీనే ప్రొడ్యూస్ చేస్తాను అని భరోసా కూడా ఇచ్చాడట. ఇక రాక్ స్టార్ పాత్రకు ముందుగా రానా ని అనుకుంటే… ఆ టైములో అతను ‘లీడర్’ సినిమా చేస్తున్నాడట. దాంతో మనోజ్ కు చెప్తే అతను వెంటనే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అనుష్క కు మాత్రం భయపడుతూనే ఆ వేశ్య పాత్ర గురించి చెప్పాడట క్రిష్. కానీ కథ విన్నాక ఆమె ఏడ్చేసిందట. అలా ‘వేదం’ ప్రయాణం మొదలైందని తెలుస్తుంది.