అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!

కన్నడలో సంచలన విజయం సాధించిన “ఆ కరాళ రాత్రి” అనే చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన చిత్రం “అనగనగా ఓ అతిధి”. పాయల్ రాజ్ పుత్, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 20) ఆహా యాప్ లో విడుదలైంది. మరి కన్నడలో సాధించిన అఖండ విజయాన్ని తెలుగు వెర్షన్ రీక్రియెట్ చేసిందో లేదో చూద్దాం.


కథ: మల్లి (పాయల్ రాజ్ పుత్) ఒకప్పుడు బాగా బ్రతికి, తండ్రి (ఆనంద్ చక్రపాణి) తాగుడు వల్ల అప్పులపాలై.. స్వంత పొలానికి వడ్డీ కడుతూ కటిక దరిద్రాన్ని అనుభవిస్తుంటుంది. ఈ క్రమంలో వారి ఇంటికి శ్రీనివాస్ (చైతన్యకృష్ణ) వస్తాడు. సుఖంగా బ్రతకడానికి కావాల్సినంత డబ్బు సంపాదించి, సరదాగా దేశాటన చేస్తుంటాడు. ఒక రోజు విడిది కోసం మల్లి ఇంట్లో ఉంటాడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో.. శ్రీనివాస్ దగ్గరున్న డబ్బు, నగలు చూసి మల్లి & కో మొత్తానికి దురాశ మొదలవుతుంది. ఈ దురాశ ఎలాంటి దుర్మార్గానికి దారి తీసింది అనేది “అనగనగా ఓ అతిధి” కథ.


నటీనటుల పనితీరు: పాయల్ రాజ్ పుత్ ను చూస్తుంటే.. ఎందుకో మాడ వెంకటేశ్వర్రావు గారు గుర్తొస్తారు. మాడా పాత్ర పోషించిన తర్వాత ఆయన కెరీర్ లో మరో వైవిధ్యమైన పాత్ర దొరకలేదు. ఇప్పుడు పాయల్ పరిస్థితి కూడా అంతే. ఆమెలో చక్కని నటి ఉన్నప్పటికీ.. దర్శకులందరూ ఆమెలోని శృంగార రసాన్ని లీటర్ల కొద్దీ పిండుకొంటున్నారు తప్పితే.. ఆమె నట ప్రతిభను మాత్రం పట్టించుకోవడం లేదు. పాయల్ ఇమేజ్ పుణ్యమా అని సినిమాలో మెయిన్ ట్విస్ట్ కూడా పేలవమైపోయింది. దానికితోడు ఆ డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఆమెకు మాత్రమే కాదు ఆనంద్ చక్రపాణికి కూడా డబ్బింగ్ అస్సలు సింక్ అవ్వలేదు.

చైతన్యకృష్ణ తన పాత్రకు న్యాయం చేయడానికి విశ్వప్రయత్నం చేసాడు కానీ.. క్యారెక్టర్ డీటెయిలింగ్ సరిగా లేకపోవడంతో ఆ క్యారెక్టర్ కు కూడా ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేరు.


సాంకేతికవర్గం పనితీరు: ఆరోల్ కర్రోల్ కెమెరా వర్క్ తప్ప సాంకేతికపరంగా చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచినవారు ఒక్కరూ లేరు. ప్రొడక్షన్ డిజైన్ & సెట్ వర్క్ అయితే చాలా చీప్. డైలాగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. తక్కువ బడ్జెట్ లో ఒక వెబ్ ఫిలిం ఎలా తీయాలని అనేందుకు చక్కని ఉదాహరణగా ఆహా వారి “కమిట్ మెంటల్” నిలిస్తే.. బ్యాడ్ ఎగ్జామ్పుల్ గా “అనగనగా ఓ అతిధి”ని పేర్కొనవచ్చు.

కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన దయాళ్ పద్మనాభన్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించినప్పటికీ.. కథలోని ఆత్మను, మ్యాజిక్ ను రీక్రియెట్ చేయలేకపోయాడు. నటీనటుల ఎంపికలోనే మొదటి వైఫల్యం చవిచూశాడు. కథ బట్టి పాత్రలు ఉండాలి కానీ.. నటీనటుల బట్టి కథ ఉండకూడదు అనే చాలా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో అర్ధం కాలేదు.

విశ్లేషణ: డిజిటల్ స్పేస్ ను సరిగా వినియోగించుకోలేకపోయిన మరో చిత్రంగా “అనగనగా ఓ అతిధి” మిగిలిపోయింది. పాయల్ ఇప్పటికైనా శృంగార తారగా కాక నటిగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని తెలియజెప్పిన చిత్రమిది.


రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus