అనంత శ్రీరాం పాటలో బ్రహ్మోత్సవం

సినీ పాటల రచయిత అనంత శ్రీరాం సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం బ్రహ్మోత్సవం సినిమా మొత్తాన్ని ఒక పాటలో నింపారు. ఆ పాటతో శ్రీరాం సొంత యూట్యూబ్ చానల్ కి శ్రీకారం చుట్టారు.

“నలుగురిలో కలిసి.. నలుగురితో నడిచి.. నలుగురు పంచె నవ్వులు ఇంకో నలుగురికే పంచి.. నలుగురులోని మంచి నలుగురికి అందించి.. నలుగురు దీవెన తోడుగా, నాలుగు దిక్కులా సాక్షిగా జనులందరూ జరిపే జన్మోత్సవం.. అది బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం..
ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ” అనే పల్లవితో సాగే ఈ పాట యూట్యూబ్ వీక్షకులకు బాగా నచ్చింది. ఇందులోని ప్రతి పదం బ్రహ్మోత్సవం సినిమా టైటిల్ ని జస్టి ఫై చేస్తోంది.

ఆ తర్వాత వచ్చే మొదటి చరణం
” ఎంత వెనుక వేసిన .. ఎంత ముందు కెళ్లినా.. వెనుకా ముందు మనకంటూ ఉండాలి కొందరైనా ..
ఎన్ని చవి చూసినా.. వింతలెన్ని చేసినా .. చూసి చేసేందుకు చివర రావాలి ఒక్కరైనా ..
చెలిమికి బదులు చెలిమిని ఆశించే చల్లని కన్నులతో..
మెతుకికి బదులు బతుకునే రాసిచ్చే వెచ్చని చేతులతో.. ప్రతి ముంగిట జరిపే ప్రేమోత్సవం
అది బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.. ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం” లో ప్రేమోత్సవం అనే పదం కొత్త ప్రయోగం .. ఇది బ్రహ్మోత్సవం కథకు కరెక్ట్ గా సూట్ అవుతుంది.

రెండో చరణం లో రచయిత సినిమా మొత్తాన్నిఅక్షరాల రూపంలో రాల్చారు అనంత శ్రీరాం.
“కొమ్మలే కాదుగా వేరు వైపు చూడవా
ప్రతి ఒక మూల మన మూలం ఉంచింది వంశ వృక్షం
నమ్మలేనంతగా సంబరాల నీయగా, మన వెనకాల కలకాలం పెడుతుంది మంచి లక్ష్యం
వెతుకుతూ వెళితే వరుసగా ఎదురయ్యే అందరూ మనవారే
కలుపుకు పోతే హాయిగా ఈ నేలంతా మన ఇల్లే
పుడమింట్లో జరిగే పుణ్యోత్సవం
అది బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.. ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.”
ఇందులో కూడా పుణ్యోత్సవం అంటూ ప్రయోగం చేశారు. పది లైన్లలో సినిమా కథ ప్రాణాన్ని పేపర్ ఫై పెట్టారు. దీనికి సాకేత్ కొమాండూరి సంగీతం ప్లస్ అయ్యింది.

ఈ పాట గురించి అనంత శ్రీరాం సోషల్ మీడియా లో .. “బ్రహ్మోత్సవం” చిత్రం కోసం ఒక పాట రాసాను. ఆ పాటని చిత్రంలో వాడటం కుదరలేదు. కానీ ఆ సాహిత్యం, మంచి అభిరుచి ఉన్న శ్రోతలకి నచ్చుతుందని నా నమ్మకం. కాబట్టి ఈ పాటని మీ ముందుంచుతున్నాను. ఈ సాహిత్యానికి. శ్రావ్యమైన కర్ణపేయమైన సంగీతం అందించినందుకు సాకేత్ కొమాండూరి గారికి, దృశ్యకూర్పునందించినందుకు వరప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పోస్ట్ చెప్పారు.

ఈ పాట వీడియోను యూట్యూబ్ లో సోమవారం ఉంచారు. దీనిచూసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది.అంతే కాదు అనంత శ్రీరాంను అభినందనలో ముంచేస్తున్నారు. “కలం పెట్టి కాకుండా మనసు పెట్టి రాసారు, ఇది సినిమాలో పెట్టి ఉంటే బాగుండేది, కనీసం ప్రచార చిత్రానికి అయినా వాడాల్సింది.. అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారికి “ఇంత బాగున్న పాటను ఎందుకు తీసుకోలేదు” అనే ప్రశ్న రాక మానదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus