కథ విన్నప్పుడు రామ్ చరణ్ హీరో అనే విషయం తెలియదు – అనసూయ అలియాస్ రంగమ్మత్త

  • July 8, 2020 / 12:04 PM IST

నటుల వల్ల పాత్రల విలువ పెరుగుతుంటుంది, అలాగే పాత్రల వల్ల నటుల స్థాయి పెరిగిన సందర్భాలూ ఉంటాయి. ఆ విధంగా ‘రంగస్థలం’ సినిమాలో పోషించిన ‘రంగమ్మత్త’ పాత్ర ద్వారా నటిగా తన స్థాయిని పెంచుకొంది అనసూయ. “క్షణం”తోనే నటిగా అందర్నీ ఆశ్చర్యపరిచినప్పటికీ.. “రంగస్థలం” సినిమాతో తన ఇమేజ్ కు విశేషమైన మేకోవర్ ఇచ్చుకుంది అనసూయ. “రామ్ చరణ్ చేత అత్త అని పిలిపించుకోవడం మినహా.. “రంగస్థలం”లో అత్త పాత్ర పోషించడం తన కెరీర్ ను కొత్త మలుపు  తిప్పిన విషయమని” చెబుతున్న అనసూయ మీడియాతో పంచుకొన్న విషయాలు విశేషాలు మీకోసం..!!

“ఆర్య 2” కాదని “రంగస్థలం” ఒకే చేశాను.. సుకుమార్ గారు నిజానికి 2009లో నేను పిక్సల్లాయిడ్ లో వర్క్ చేస్తున్నప్పుడే “ఆర్య 2″లో నటించమని అడిగారు. అయితే.. అప్పుడే నాకు ఎంగేజ్ మెంట్ అవ్వడం, ఒక వ్యక్తిగా నాకు కూడా సరైన మెచ్యూరిటీ లేకపోవడంతో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాను. మళ్ళీ ఇప్పుడు “రంగస్థలం” కథ చెప్పినప్పుడు పాత్రలో నేను పూర్తిగా లీనమైపోయాను. అయితే.. ఈ పాత్రలో నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం ఉండేది. కానీ.. ప్రతి విషయంలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి కదా. అందుకే ధైర్యంగా రంగమ్మత్త రోల్ యాక్సెప్ట్ చేశాను. కానీ.. ఈరేంజ్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు.

దొరసానమ్మ అని పిలిచేవారు.. నిజానికి నాకు పల్లెటూర్ల గురించి అంతగా తెలియదు. అయితే.. చిన్నప్పుడు తాతగారి ఉరైన “పోచంపల్లి” వెళ్లినప్పుడు అక్కడ నన్ను అందరూ “దోరసానమ్మ” అని పిలిచేవారు. చిన్నప్పుడు ఆ పిలుపు, మర్యాద బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఆ ఎక్స్ పీరియన్స్ ‘రంగమ్మత్త” రోల్ ప్లే చేయడంలో కాస్త ఉపయోగపడింది. అలాగే డబ్బింగ్ టైమ్ లో మా మూవీ రైటర్స్ నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ ఎఫర్ట్స్ వల్లే గోదావరి యాసలో అంత చక్కగా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోగలిగాను.

నన్ను నేను ఎప్పుడు తక్కువగానే అంచనా వేసుకొంటాను.. నా విజయ రహస్యం అని ప్రత్యేకించి ఏమీ లేదు. నన్ను నేను ఎప్పుడూ ఎక్కువ అనుకోను. ఇంకా చెప్పాలంటే నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసి చూసుకొంటాను. అందుకే నాకు లభించిన ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అనుకొంటాను. అందుకే ఇప్పటివరకూ నేను ప్లే చేసిన ప్రతి రోల్ లోనూ మెప్పించగలిగాను.

లేడీ ప్రకాష్ రాజ్ అయిపోవాలి.. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలన్నీ చూసుకుంటే.. “క్షణం”లో నెగిటివ్ రోల్, “విన్నర్”లో స్పెషల్ సాంగ్, “గాయత్రి”లో సపోర్టింగ్ రోల్, ఇప్పుడు “రంగస్థలం”లో సపోర్టింగ్ రోల్. ఇలా నేను పోషించే ప్రతి పాత్ర డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకొంటాను. “క్షణం” తర్వాత ఆ తరహా పోలీస్ పాత్రలు బోలెడన్ని వచ్చాయి, అలాగే “విన్నర్” తర్వాత స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. అయితే.. నేను ఒక ఇమేజ్ లో కూరుకుపోవాలి అనుకోవడం లేదు. ప్రకాష్ రాజ్ గారు ఎలా అయితే ఒక అన్నగా, తండ్రిగా, తాతగా, విలన్ గా ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటారో. నేను కూడా అదే తరహాలో ముందుకు సాగాలని కోరుకొంటున్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే.. “లేడీ ప్రకాష్ రాజ్”లా అవ్వడం నా ధ్యేయం.

నాకు ఏ కెమెరా అయినా ఒకటే.. యాంకర్ గా నా కెరీర్ “రెచ్చిపో” ఆడియో రిలీజ్ ఫంక్షన్ తో మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటివరకూ నేను చాలా రంగాల్లో రాణించాను. యాంకర్ గా, షో హోస్ట్ గా, యాక్టర్ గా చాలా పాత్రలు పోషించాను. నాకు టీవి కెమెరా, సినిమా కెమెరా అయినా ఒకటే. అందుకే బుల్లితెరపై ఎలా కనిపిస్తానో, వెండితెర మీద కూడా అలాగే కనిపిస్తాను. మహా అయితే వేషధారణలో తేడా ఉంటుంది.

రామ్ చరణ్ తో మొదటి సీన్ అదే.. నిజానికి ‘రంగస్థలం” కథ విన్నప్పుడు ఆ సినిమాలో రామ్ చరణ్ హీరో అనే విషయం నాకు తెలియదు. తెలిసాక “చరణ్ తో అత్త అని పిలిపించుకోవాలా.. కనీసం రంగమ్మ అని అయినా పిలిపించండి” అని రిక్వెస్ట్ చేశాను. ఇక చరణ్ నా మొదటి సీన్ “పడవలో తాగే సన్నివేశం”. ఆ సీన్ నాకు ఎక్స్ ప్లెయిన్ చేసినప్పుడు చరణ్ తో అంత డామినేటింగ్ గా ఎలా నటించాలి?, అతని జుట్టు నిమారాలి, ఒడిలో పడుకోబెట్టుకొని ఓదార్చాలి, ఒక స్టార్ హీరో అయిన చరణ్ తో ఇవన్నీ మొదటి రోజే ఎలా చేయగలను? అన్న భయం ఉండేది. అయితే.. సెట్స్ లో చరణ్ ని చూశాక నా భయం మొత్తం పోయింది.

నేను ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా చూడలేదు.. “అర్జున్ రెడ్డి” సినిమా గురించి నేను రైజ్ చేసిన పాయింట్ ని జనాలు తప్పుగా అర్ధం చేసుకొన్నారు. నేను బాధపడింది సినిమాలో బూతులు తిట్టినందుకు కాదు. ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ సదరు బూతు మాటను ఏదో ఫ్యాషన్ అన్నట్లు రిపీట్ చేయడాన్ని నేను తప్పుబట్టాను. ఆ సమయంలో ఒక రెండేళ్ల కుర్రాడు ఫోన్ లో తన తండ్రి వీడియో తీస్తుండగా “ఏం మాట్లాడుతున్నావ్ రా *****” అని అనడం చూసి నేను షాక్ అయ్యాను. అందుకే మీడియా సాక్షిగా ఫైర్ అయ్యాను. దాన్ని జనాలు వేరే విధంగా తీసుకొన్నారు. నేను ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు.

మా ఆయన కాంప్లిమెంట్ ది బెస్ట్.. “క్షణం” సినిమా చూసిన తర్వాత కూడా మా హజ్బెండ్ అంతగా అప్రిషియేట్ చేయలేదు. కానీ.. “రంగస్థలం” చూశాక “నటిగా ఎదిగావ్ అనసూయ” అని చెప్పడం మాత్రం ఎప్పటికీ మరువలేను. నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది. ఆ తర్వాత కూడా చాలా మంది మెసేజ్ చేశారు కానీ.. కొందరు డైరెక్టర్స్ కాల్ చేసి “నిన్ను ఇన్నాళ్ళు సరిగా యూటిలైజ్ చేసుకోలేదు, ఇకనుంచి నీకోసం పాత్రలు రాస్తాము” అన్నారు.

సోషల్ మీడియాకి మాత్రం ఎప్పటికీ దూరంగానే ఉంటాను.. నేను సోషల్ మీడియాకి కొన్నాళ్లపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. రీజన్ అందరికీ తెలిసిందే. అయితే.. నెగిటివిటీ ఎదుర్కోలేక కాదు.. ఆ ఎఫెక్ట్ మా తల్లిదండ్రులకు ఎక్కువగా తగులుతుంది. అందుకే ఆ సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అయ్యాను. అయితే.. ఎవరికో భయపడి నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండడం ఎందుకు అనిపించింది. అదే సమయంలో ఆ నెగిటివిటీ ఎదుర్కొనే స్థాయిలో నేను ఇంకా మెంటల్ గా రెడీగా లేను అని కూడా అనిపించింది. అందుకే ఒక టీం ను ఏర్పాటు చేసుకొన్నాను. ప్రస్తుతం వాళ్ళే నా సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం చూస్తుంటాను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus