సక్సెస్ ఫుల్ పెయిర్ రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం “అంధగాడు”. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకక్కించిన ఈ చిత్రాన్ని ఏ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం నేడు (జూన్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ : గౌతమ్ (రాజ్ తరుణ్) వైజాగ్ లో రేడియో జాకీగా పనిచేసే అంధుడు. ఎప్పటికైనా తనకు కళ్ళు వస్తాయనే నమ్మకంతో.. తనకు కళ్లను దానం చేసే డోనర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ సమయంలో నేత్ర (హెబ్బా పటేల్) పరిచయమవుతుంది. తాను అంధుడ్నని అనే విషయం చెప్పకుండా నేత్రను ప్రేమించడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ.. గౌతమ్ అంధుడని నేత్రకు తెలిసి.. అతడ్ని విడిచిపోతుంది. కరెక్ట్ గా అదే టైమ్ కి కులకర్ణి (రాజేంద్రప్రసాద్) అనే వ్యాపారి ఆకస్మికంగా మరణించడంతో, కులకర్ణి చివరి కోరిక మేరకు అతడి కళ్ళు అనాధ అయిన గౌతమ్ కు ట్రాన్స్ ప్లాంట్ చేయడం జరుగుతుంది. కళ్లొచ్చిన గౌతమ్ కి ఉన్నట్లుండి ఒక కారు, ఎవరెవరో వ్యక్తులు పదే పదే కనిపిస్తుంటారు. వారి వల్ల గౌతమ్ కి ప్రాణహాని కలుగుతుంటుంది. ఎవరా వ్యక్తులు, ఎవరిదా కారు, అసలు గౌతమ్ కి ఎందుకు కనిపిస్తుంటాయి, వాళ్ళు గౌతమ్ ను ఎందుకు చంపాలనుకొంటారు? వంటి ప్రశ్నలకు పేలవమైన సమాధానాల సమాహారమే “అంధగాడు” చిత్రం.
నటీనటుల పనితీరు : కామెడీ సినిమా కావడంతో.. అంధుడిగా రాజ్ తరుణ్ పేలవమైన నటన కామెడీలో కలిసిపోయింది. లేదంటే.. వీడు నిజంగా గుడ్డోడేనా అనే సందేహం ప్రేక్షకులకు ప్రతి ఫ్రేమ్ లోనూ కలుగుతూనే ఉంటుంది. ఇక కామెడీ టైమింగ్ పరంగా ఎప్పటిమాదిరే తనదైన శైలిలో ఆకట్టుకొన్నాడు. హెబ్బాతో మరీ ఎక్కువసార్లు కలిసి నటించేయడం వల్లనో ఏమో తెలియదు కానీ.. కంఫర్టబుల్ గా కనిపించాడే కానీ కెమిస్ట్రీ మాత్రం పెద్దగా పండలేదు. ఇక నేత్ర అనే డాక్టర్ పాత్రలో హెబ్బా పటేల్ అందంతో ఆకట్టుకోలేక.. అభినయంతో అలరించలేక కనబడిన కాసేపు అలరించడానికి నానా తిప్పలు పడింది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్ళినా.. అమ్మడి మేకప్, డ్రెస్సింగ్ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అంధగాడి పక్కన ఆందగత్తెలా కాక అనాకారిలా అగుపించి ఇబ్బందిపెట్టింది.
రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది కానీ.. సదరు పాత్రకు ట్విస్టులు మరీ ఎక్కువగా రాయడంతో.. క్యారెక్టర్ ఇంపాక్ట్ కథతో సింక్ అవ్వలేదు. అయితే.. రాజేంద్రప్రసాద్ మాత్రం తన సీనియారిటీతో పాత్రకు ప్రాణం పోసేశాడు. సత్య కామెడీ టైమింగ్ సినిమాకి ప్లస్ పాయింట్. క్లైమాక్స్ లో కన్ఫ్యూజన్ కామెడీతో.. ఫస్టాఫ్ లో సింగిల్ లైన్ పంచ్ డైలాగులతో విశేషంగా అలరించాడు. రాజారవీంద్ర కంఠంతో క్రియేట్ అయిన విలనిజం పాత్ర స్వభావంతో ఏర్పడకపోవడం మైనస్. ఏదో పెద్ద విలన్ అంటూ ఇంట్రడ్యూస్ చేయగా.. ఒక్క సీన్ లో కూడా అతడి విలనిజాన్ని సరైన రీతిలో ఎలివేట్ చేయకపోవడంతో అతడి పాత్ర వల్ల కూడా సినిమాలో పెద్దగా ఇంకాప్ట్ క్రియేట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు : శేఖర్ చంద్ర బాణీలు సోసోగా ఉన్నాయి.. బ్యాగ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ సరిగా సింక్ అవ్వకపోవడంతో చాలా చోట్ల డైలాగ్స్ ను బిజీయమ్ డామినేట్ చేసింది. ఆ కారణం వల్ల ప్రేక్షకుడు మాటల్లోని భావాల్ని మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద మైనస్ గా నిలిచింది. నిర్మాతలు బడ్జెట్ విషయంలో పరిమితులు ఎక్కువగా పెట్టడం వల్లనో లేక మరేదో కారణమో తెలియదు కానీ.. ఏవో రెండు మూడు సీన్లు మినహా ఔట్ పుట్ విషయంలో లోబడ్జెట్ చిత్రాల స్థాయిలో కూడా లేకపోవడం గమనార్హం. కొన్ని సన్నివేశాల్లో డి.ఐ సరిగా చేయని ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంటుంది.
ఈ తరహా కథకు ఈమాత్రం బడ్జెట్ పెట్టడమే ఎక్కువ అనుకొన్నారో ఏమో కానీ.. ఆఫీస్, కాలేజ్, హాస్పిటల్ లాంటి చాలా సన్నివేశాలను ఒకే లొకేషన్ లో కాస్త అటు ఇటు మార్చి షూట్ చేసేయడం లాంటివి చేయడం వల్ల నిర్మాణ లోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. రైటర్ టర్నడ్ డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ రాసుకొన్న కథ కాస్త ఆసక్తికరంగానే ఉన్నా.. “కోకిల (తెలుగు), డార్లింగ్ (తెలుగు), తీన్ (హిందీ)” లాంటి సినిమాల స్పూర్తి ఎక్కువగా కనిపిస్తుంది. ట్విస్టులు ఎక్కువ ఇవ్వాలనుకొన్నప్పుడు కథనం ఇంకా బలంగా ఉండాలి. కానీ దర్శకుడు చాలా పేలవమైన కథ-కథనాలకు భారీ ట్విస్టులు రాసుకోవడంతో.. ఆ ట్విస్టులు ఎలివేట్ అవ్వక, ప్రేక్షకుడు కథనంతో కలిసి ప్రయాణించలేక ఇబ్బందిపడతాడు.
సో, ఒక రైటర్ గా సెంట్ పర్సెంట్ మార్క్స్ సంపాదించుకొన్న వెలిగొండ.. డైరెక్టర్ గా తొలి ప్రయత్నంలో బొటాబోటి మార్కులతో సరిపెట్టుకొన్నాడు.
విశ్లేషణ : ఈ “అంధగాడు” కథలో ఉన్న ట్విస్టులు బాగానే ఉన్నా.. వాటిని రివీల్ చేసే విధానం మాత్రం సోసోగా ఉంది. ఆ కారణంగా కాస్తంత ఓపికతో ఒకసారి చూడదగిన చిత్రంగా మిగిలిపోయింది.