Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాక, ఆ క్రేజ్ చూసుకుని ముఖానికి రంగు వేసుకోవాలనిపిస్తుందట. ఇప్పటికే చాలామంది కోలీవుడ్, టాలీవుడ్ డైరెక్టర్లు మైక్ వదిలేసి హీరోలుగా మారి చేతులు కాల్చుకున్నారు. కానీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం ఆ ‘ట్రాప్’ లో పడనని మొహమాటం లేకుండా తేల్చి చెప్పారు. తనలోని ఈజ్, డాన్స్ చూసి జనం హీరో మెటీరియల్ అని పొగిడినా, ఆయన మాత్రం ఆ ఆశల పల్లకి ఎక్కనని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Anil Ravipudi

అసలు విషయం ఏంటంటే, అనిల్ లో మంచి కామెడీ టైమింగ్, మాస్ పల్స్ ఉన్నాయి. ఈవెంట్లలో ఆయన వేసే స్టెప్పులు చూసి, మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా అని చాలామంది సలహాలు ఇస్తున్నారట. సోషల్ మీడియాలో కూడా ఇదే గోల. కానీ అనిల్ మాత్రం దీనికి చాలా మెచ్యూూర్డ్ గా ఆన్సర్ ఇచ్చారు. మనం ఒక క్రాఫ్ట్ లో టాప్ లో ఉన్నప్పుడు, పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రలోభాలు వస్తాయని, వాటికి లొంగితే ఉన్న కెరీర్ కూడా కొల్లేరు అవుతుందని గట్టిగా చెప్పారు.

రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా అనిల్ కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆ ట్రాక్ రికార్డ్ కాపాడుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యం. అనవసరంగా నటన వైపు వెళ్లి ఫోకస్ తగ్గించుకోవడం ఇష్టం లేదట. ప్రస్తుతం ఆయన దృష్టంతా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా మీదే ఉంది. 2026 సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, నయనతార లాంటి భారీ కాస్టింగ్ ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్, వచ్చే పండక్కి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డైరెక్షన్ లో కింగ్ లా బతుకుతూ, హీరోగా మారి ఎందుకు రిస్క్ చేయాలని ఆయన అనుకోవడం నిజంగా తెలివైన నిర్ణయం. సక్సెస్ ని తలకెక్కించుకోకుండా, గ్రౌండ్ లెవెల్ లో ఆలోచించే తత్వం ఉంది కాబట్టే అనిల్ ఇంత స్పీడ్ గా సినిమాలు తీయగలుగుతున్నారని ఆయన ఫాలోవర్స్ అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus