‘ఖైదీ నెం 150’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి ఆ తర్వాత తన సినిమాల ఎంపికలో ఒక విషయం మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అదే రీమేక్‌లు. సెకండ్ ఇన్నింగ్స్ సినిమాల్లో ఎక్కువ శాతం రీమేక్‌లనే నమ్ముకుంటున్నారు చిరంజీవి. ఇప్పుడు చూసుకుంటే ‘ఆచార్య’ తర్వాత లైనప్‌లో ఉన్న మూడు సినిమాల్లో రెండు రీమేక్‌లే ఉన్నాయి. అవే ‘లూసిఫర్’, ‘వేదాళం’. తాజాగా చిరు లైనప్‌లో మరో సినిమా చేరుతుందని వార్తలొచ్చాయి. ఆ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారని టాక్.
చిరంజీవిని ఇటీవల కలసిన ప్రభుదేవా ఓ కథ గురించి చర్చించారని… దానికి చిరంజీవి కూడా ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఆ సినిమా ఏంటనేది తెలియలేదు కానీ… రీమేక్ స్టోరీ అని మాత్రం తెలుస్తోంది. మామూలుగానే ప్రభుదేవాను రీమేక్‌ల స్పెషలిస్ట్ అని అంటుంటారు. ఆ క్రమంలోనే చిరంజీవి నుండి ప్రభుదేవాకు పిలుపు వెళ్లింది అంటున్నారు. గతంలో ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఈ ఇద్దరూ కలసి పని చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు చిరంజీవి చూపు ఏ రీమేక్ మీద పడింది అనేది తెలియడం లేదు. ఇటీవల కాలంలో అంతటి హీరోయిజం ఉన్న సినిమాలు, అందులో చిరంజీవి స్థాయి సినిమాలు ఏమున్నాయనేది చూడాలి. ఒకవేళ అంతా ఓకే అయ్యి చిరంజీవి – ప్రభుదేవా సినిమా చేస్తే ‘.. జిందాబాద్’ గుర్తులను చెరిపేసేలా బలంగా ఉండాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.