గతేడాది ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు ‘ఏ.ఎం.బి’ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనే ‘ది బెస్ట్ మల్టీప్లెక్స్’ గా చాలా ఫేమస్ అయ్యింది. కొన్ని చిన్న చిత్రాలని కూడా ఇందులో ప్రమోట్ చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.అయితే ఎఎంబీ (ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్ ‘జి.ఎస్.టి’ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణలు వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసిందట. ‘ఏ.ఎం.బి సినిమాస్’ లో టికెట్ల ధరలు తగ్గించలేదని… తద్వారా పన్ను తగ్గింపు ప్రయోజనం ప్రేక్షకులు పొందకుండా చేస్తున్నారని ‘జి.ఎస్.టి’ అధికారులు గుర్తించారట.
ఇటీవల టికెట్ ధర 100కు పైగా ఉండడంతో ‘జి.ఎస్.టి’ టాక్స్ ను 28 శాతం నుండీ 18 శాతానికి తగ్గించారు. ఇక టికెట్ ధర రూ. 100 కు తక్కువగా ఉన్నవాటికి… 18 శాతం నుండీ 12 శాతానికి తగ్గించారు. జనవరి 1 నుండీ ఈ కొత్త రేట్లు అమలులోకి రావాల్సి ఉంది. అయితే ‘ఏ.ఎం.బి సినిమాస్’.. ఈ నిబంధనలను ఉల్లఘించిందని… ఆ కారణంగా అధికారులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందని, కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ వార్తల స్పందించిన ఏషియన్ సునీల్.. “జీఎస్టీ తగ్గింపు విషయంలో ‘ఏ.ఎం.బీ సినిమాస్’ కు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. అధికారులు థియేటర్ కి వచ్చిన మాట వాస్తవమే… కానీ మేము ‘జి.ఎస్.టి’ తగ్గించే టికెట్ లు విక్రయిస్తున్నాము, ఆ రికార్డులే అధికారులు అడిగితే ఇచ్చాము అంతే.! పెనాల్టీ కట్టాలని… అధికారులు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఒకవేళ నోటీసులు ఇచ్చినా.. ఎంత కట్టాలని చెబుతారో అంత కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నోటీసులు ఇచ్చారనే వార్తలు తెలుసుకున్న అధికారులే… ఆశ్చర్యపోయారు. ‘ఏ.ఎం.బీ సినిమాస్’ ఎటువంటి నిబంధనలను బ్రేక్ చేయవు… అధికారులు చెప్పినట్లే చేస్తాము” అంటూ వివరణ ఇచ్చారు సునీల్.