హైదరాబాద్: నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు (ANR) 101వ జయంతిని పురస్కరించుకుని, ఆయన నటించిన డాక్టర్ చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం చిత్రాలను 2025 సెప్టెంబర్ 20 మరియు 21 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ అద్భుత నటనను చూసి పెరిగిన ప్రేక్షకులకు ఆయన అభిమానులకు ఆయన జయంతి సందర్భంగా ఇది ఒక అపురూప కానుకగా చెప్పవచ్చు.
ఈ రీరిలీజ్ టికెట్లు 2025 సెప్టెంబర్ 18 నుండి బుక్ మై షోలో ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ (థియేటర్ ఎంపిక కావలసి ఉంది), విజయవాడ (స్వర్ణ ప్యాలస్), విశాఖపట్నం (క్రాంతి థియేటర్), ఒంగోలు (కృష్ణ టాకీస్) వంటి ముఖ్యమైన నగరాల్లో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు. మరిన్ని నగరాలలో కూడా ఈ సినిమాలను ప్రదర్శించబోతున్నారు అని తెలుస్తోంది.
ఏఎన్నార్ సినిమాలు అనేక మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ రీరిలీజ్ ద్వారా ఆయన అప్రతిహత సినీ సేవలను గుర్తుచేసుకుంటూ, పాత తరం నుంచి కొత్త తరం వరకు అందరికీ మరిచిపోలేని సినీ అనుభూతిని అందజేసే ప్రయత్నం చేయనున్నారు.