హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కథానాయికగా నటించిన తాజా చిత్రం “అంతకు మించి”. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఎప్పటిలానే రష్మీ అందాలను ఎరగా చూపి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు దర్శకనిర్మాతలు. మరి వారి ప్లానింగ్ ఫలించిందో లేదో చూద్దాం..!!
కథ : రాజు (సతీష్) పని చేయకుండా డబ్బు సంపాదించి కోటీశ్వరుడైపోవాలని కలలు కనే యువకుడు. కానీ సంపాదించడం ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో “దెయ్యం ఉందని నిరూపిస్తే 5 కోట్ల రూపాయల” బహుమతిని ప్రకటిస్తాడు ఓ ముసలాయన. అప్పటినుంచి దెయ్యాల కోసం స్మశానాల్లో తిరుగుతుంటాడు రాజు. దెయ్యాలు లేవు అంటూ తన తండ్రితో కలిసి ప్రచారం చేస్తుంటుంది మధుప్రియ (రష్మీ గౌతమ్). ఈ ఇద్దరూ ఒకానొక సందర్భంలో ఒక బంగ్లాలో కలిసి పనిచేయాల్సి వస్తుంది.
ఇంతకీ దెయ్యం ఉందా? లేదా? రాజు-ప్రియలు దెయ్యం ఉందని ప్రూవ్ చేశారా లేక లేదని నిరూపించారా? అనేది “అంతకుమించి” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : డబ్బులున్నాయి కాబట్టి హీరో అయ్యాడు కానీ.. సతీష్ ది హీరో మెటీరియల్ మాత్రం కాదు. డబ్బింగ్ ఒక్కటీ కాస్త పర్లేదు కానీ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మాత్రం అబ్బాయ్ చాలా డెవలప్ అవ్వాలి.
ఇక రష్మీ ఎప్పటిలానే ఏమాత్రం ఇబ్బంది పడకుండా చాలా ఉదారంగా ఒక పాటలో తన అందాలు ఆరబోసి, ఇంకొన్ని సన్నివేశాల్లో ఎక్స్ పోజ్ చేసి తన కోసం థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల్ని సంతోషపరచడానికి తనవంతు ప్రయత్నం చేసింది. సూర్య, మధునందన్ లు తమ పాత్రలతో మెప్పించడానికి కాస్త గట్టిగానే ప్రయత్నించారు.
సాంకేతికవర్గం పనితీరు : వడ్డించిన బిర్యానీ బాగోలేనప్పుడు అందులో వేసిన పోపులు, తాళింపుల గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. సో, ఇక్కడ ముఖ్యమైన కథ-కథనం బాగోలేనప్పుడు ఇంక సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, గ్రాఫిక్స్, డి.ఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండాపోయింది.
దర్శకుడు రాసుకున్న కథ అసలే పాతది అనుకుంటే.. దెయ్యాలు లేవు అని ప్రూవ్ చేసే డిస్కషన్స్ లో చెప్పిన లాజిక్స్ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇక హారర్ స్టోరీని రన్ చేయడం కోసం రాసుకున్న సాగతీత సన్నివేశాలు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి.
విశ్లేషణ : ఈ సినిమాకి వెళ్లే అతి తక్కువమంది ప్రేక్షకులు ఆశించేది రష్మీ గ్లామర్ మాత్రమే. ఆ గ్లామర్ డోస్ ఎలాగూ ఫస్టాఫ్ లో వచ్చే ఒక పాటతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. కుదిరితే ఫస్టాఫ్ లో బయటపడండి లేదా యూట్యూబ్ లో ఆ సాంగ్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి.
రేటింగ్ : 1/5