అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!

త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ది ప్రధాన పాత్రల్లో బాలు అడుసుమిల్లి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి”. నలుగురు అమ్మాయిలు చేసిన ఒక పొరపాటును కవర్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో దొర్లిన తప్పుల తడక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: ఒక జర్నలిస్ట్ (త్రిధా చౌదరి), ఒక హౌస్ వైఫ్ (సిద్ధి), ఒక మోడల్ (కోమలీ ప్రసాద్), ఒక సింగిల్ అమ్మాయి (ధన్య బాలకృష్ణ). ఈ నలుగురు అమ్మాయిలూ మంచి స్నేహితులు. అయితే.. వాళ్ళ రెగ్యులర్ లైఫ్స్ తో బోర్ కొట్టి, కాస్త సాంత్వన పొందాలనుకుని టైం స్పెండ్ చేయడం కోసం ఒక హోటల్ కి వెళ్తారు. అక్కడ ఒక మేల్ స్ట్రిప్పర్ ను బుక్ చేసుకుంటారు. ఊహించని సంఘటనల నేపథ్యంలో ఆ స్ట్రిప్పర్ మరణించాడని అనుకోని.. ఆ తప్పు నుండి తప్పించుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తారు. మధ్యలో కొందరు ఈ నలుగురు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడానికి, ఇంకొందరు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రచ్చ నుండి ఈ నలుగురు అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? అనేది “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో లెక్కకు మిక్కిలి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ నటనతో ఆకట్టుకున్నవారి సంఖ్య మాత్రం తక్కువే. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవరూ లేరనే చెప్పాలి. ధన్య, సిద్ధి, త్రిధా, కోమలీ సినిమాకు గ్లామర్ ను యాడ్ చేయడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోయింది. రఘు, మధునందన్, సమీర్ ల నటన, పాత్రలు పర్వాలేదు. సర్వర్ పాత్ర పోషించిన నటుడి హాస్యం ఆకట్టుకుంటుంది. కొన్ని కామెడీ సీన్లు, ఒక పాట కాస్త బెటర్ అని చెప్పొచ్చు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం పెద్దగా రాలేదు. శేఖర్ కెమెరా వర్క్, వికాస్ బాణీలు మరియు నేపధ్య సంగీతం పర్వాలేదు. డి.ఐ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది. దర్శకుడు బాలు చిత్ర మూలకథను రఫ్ నైట్ (2017) అనే హాలీవుడ్ చిత్రం నుండి స్ఫూర్తి పొందినప్పటికీ.. తెలుగీకరించే క్రమంలో బోలెడన్ని ట్విస్టులు యాడ్ చేసాడు. అయితే.. చిక్కుముడులు తీయడం, వేసినంత ఈజీ కాదు కాబట్టి ఆ ట్విస్టులను రివీల్ చేసే క్రమంలో మాత్రం తడబడ్డాడు. ఒక బీలెవెల్ మసాలా సినిమాకి కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నప్పటికీ.. సరైన స్క్రీన్ ప్లే & డీలింగ్ కొరవడడం కారణంగా సినిమా ఆకట్టుకోలేకపోయింది.

విశ్లేషణ: రొటీన్ మసాలా ఎంటర్ టైన్మెంట్ ను ఎంజాయ్ చేసేవారికి ఈ చిత్రం ఓ మోస్తరుగా నచ్చే అవకాశాలున్నాయి. అయితే.. రెగ్యులర్ మూవీ గోయర్స్ కి మాత్రం టైటిల్ జస్టిఫికేషన్ అయిపోతుంది.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus