ప్రకాష్ రాజ్ తో గొడవపై స్పందించిన అనుపమ!

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. అ..ఆ , ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది.  ప్రస్తుతం ఆమె ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి “హలో గురు ప్రేమ కోసమే” అనే సినిమా చేస్తోంది. “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌కపాత్ర‌లో కనిపించనున్నారు. అతనికి అనుపమకు మధ్య అనేక ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ షూటింగ్ మధ్యలో ఇద్దరికీ గొడవ జరిగిందని, అందువల్ల షూటింగ్ ఆగిపోయిందని కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై నేడు అనుపమ స్పందించింది. ‘‘దాదాపు మేము 6 నెలలు కలిసి పనిచేశాం. మామధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్‌ని బయట చాలా పెద్దది చేశారు.

ప్రకాష్ రాజ్ ఒక చిన్న సలహా ఇచ్చారు. ఇది కాస్తా ఒకరి నుంచి మరొకరికి చేరే సరికి ఆ సంఘటనని మార్చివేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మేము 25 రోజులపాటు కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాం. ఇప్పటికీ మామధ్య మంచి అనుబంధం ఉంది”అని అనుపమ వెల్లడించింది. “భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పనిచేయడానికి ఇష్టపడుతాం. జరిగిన చిన్న విషయాన్ని వాళ్ల సొంత కథనాలు జోడించి చెప్పడంలోనే జనానికి ఆసక్తి ఉంటుంది’’ అని స్పష్టం చేసింది. దిల్ రాజు నిర్మిస్తున్న “హలో గురు ప్రేమ కోసమే”  చిత్రాన్నీ  దసరా కానుకగా అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus