అల్లు అర్జున్ – అట్లీ సినిమా షూటింగ్ గత కొన్ని నెలలుగా ముంబయిలో జరుగుతోంది. ఇటు హైదరాబాద్, అటు చెన్నై కాకుండా మొత్తంగా ముంబయిలో షూటింగ్ చేయడం ఏంటి? అనే చర్చ ఓవైపు నడుస్తోంది. దీనికి సినిమా టీమ్ ఆన్సర్ ఇస్తుందేమో చూడాలి. ఆ విషయం పక్కన పెడితే ఇందులో నటించే హీరోయిన్లు ఎవరు అనే లెక్క తేలడంం లేదు. ఓవైపు సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది అని వార్తలొస్తున్నా.. ఇంకా హీరోయిన్లు ఫిక్స్ అవ్వలేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇప్పటికే దీపికా పడుకొణెను ఓ హీరోయిన్‌గా సినిమా టీమ్ అనౌన్స్ చేసింది. అయితే మరో నలుగురు హీరోయిన్లు ఈ సినిమాలో ఉంటారు అని ఎప్పటి నుండో సమాచారం వస్తోంది. వారంతా బాలీవుడ్ నుండే ఉంటారు అని కూడా చెబుతున్నారు. యంగ్ హీరోయిన్‌లు, స్వింగ్‌లో ఉన్న హీరోయిన్లను ఎంచుకుంటున్నారు అనే మాటలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, వామికా గబ్బి లాంటి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని పేరు ఒకటి చర్చలోకి వచ్చింది.
ఎనిమిదేళ్లుగా సినిమాలు చేయని ఓ స్టార్ హీరోయిన్‌ని ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అడిగారు అని బాలీవుడ్ టాక్. ఆమెనే అనుష్క శర్మ. స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని, అక్కడికి కొన్నేళ్ల తర్వాత లండన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది అనుష్క. ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. మధ్యలో ‘ఖాలా’ అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. దానికి ముందు ‘బుల్‌బుల్’ అనే సినిమాను నిర్మించింది. మధ్యలో చేసిన ‘చక్డా ఎక్స్‌ప్రెస్’ విడుదలకు నోచుకోవడం లేదు.
ఇలా సినిమాలు ఆపేసిన హీరోయిన్‌ను అట్లీ అండ్ టీమ్ కాంటాక్ట్ అయిందని టాక్. మరి ఆమె ఓకే చేస్తుందా అనేది చూడాలి. అన్నట్లు సినిమాలు ఆపేసినా ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ పెరామీటర్స్‌లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు సినిమా చేసినా మన కుర్రాళ్లు లైక్ చేసేస్తారు..