మోటో క్రాస్.. రేసింగ్ క్రీడల గురించి అవగాహన ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి ఈ పేరు కొత్త. బైక్ రేసుల గురించి తెలిసిన వారికి కూడా కొంతమందికి దీని గురించి తెలియదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి కాన్సెప్ట్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు శర్వానంద్ – అభిలాష్ రెడ్డి. అదే ‘బైకర్’. మొన్న సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదాపడి వచ్చే నెల రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు సినిమా టీమ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ వీడియో చూసిన ప్రేక్షకులు చిన్నపాటి షాక్ అయ్యారు.
దానికి కారణం ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా ఎవరూ చేయలేదు.. ఎవరూ తీయలేదు.. కాబట్టి ఎవరూ చూడలేదు.. కూడా. ఈ మాట మేం మాత్రమే అంటున్నది కాదు. ఆ సినిమా హీరో శర్వానంద్ కూడా ఇదే మాట అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శర్వానంద్ మాట్లాడుతూ సినిమా గురించి పడ్డ కష్టం, శ్రమ గురించి వివరంగా వెల్లడించారు. ఇలాంటి స్క్రిప్ట్‌లు రాయించి, నిర్మాత సెట్‌లో ఉండి పని చేయిస్తేనే మంచి సినిమాలు వస్తాయి అని అన్నారు. నిర్మాతలు మంచి కథలు ఎంపిక చేసి, బడ్జెట్‌లో సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. హీరోలుగా మేమే కాదు, అందరూ బాగుంటారు అని చెప్పారు.
ఇక ఈ సంక్రాంతికి చెప్పి మరీ హిట్ కొట్టానని, ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ‘బైకర్’ సినిమా బంపర్ హిట్ అవుతుందన్నారు. ఇలాంటి కథల్లో యాక్షన్ సీక్వెన్స్ చేయడం సులభం కాదు. చాలా మందికి దెబ్బలు తగిలాయి. మేం పడిన కష్టం మేకింగ్ వీడియోల్లో చూస్తారు. మన తెలుగు కుర్రాడు అభిలాష్ మంచి సినిమా తీశారని అందరూ గర్వంగా చెప్పుకొంటారు అని అన్నారు శర్వానంద్.
సినిమాలోని రేసింగ్ సన్నివేశాలన్నీ ఇండోనేషియాలోని ఒక ఐల్యాండ్‌లో షూట్ చేశామని చెప్పారు దర్శకుడు. ఈ కథ కోసం నిర్మాతలు ఏది అడిగితే అది ఇచ్చారని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి 50 మందికిపైగా రేసర్లను రప్పించారని అభిలాష్ తెలిపారు. ఈ సినిమా కాన్సెప్ట్ చూసి కొంతమంది హాలీవుడ్ సినిమా ‘ఎఫ్1’తో పోలుస్తున్నారని.. అది మాకు సంతోషమేనని అన్నారు. అయితే, ‘ఎఫ్1’ సినిమా రిలీజ్ అయ్యేసరికి తమ సినిమా సగానికిపైగా పూర్తయిందని తెలిపారు.