బాహుబలి నిర్మాణ సారధులు రూపొందించిన తాజా వెబ్ సిరీస్ “ఆన్యాస్ టుటోరియల్”. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. నివేదితా సతీష్ టైటిల్ పాత్ర పోషించగా.. రెజీనా కీలకపాత్ర పోషించిన ఈ సిరీస్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: అక్క(రెజీనా)తో కలిసి ఉండడం ఇష్టం లేక లాక్ డౌన్ టైంలో ఒక అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతుంది లావణ్య అలియాస్ ఆన్య (నివేదితా సతీష్). సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ ఇస్తూ ఇన్ఫ్లూయెన్సర్ గా ఎదగడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే.. ఆన్య నివసించే ఫ్లాట్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
తొలుత అవన్నీ ఆన్య తన ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం చేస్తుందని అందరూ అనుకున్నప్పటికీ.. అనంతరం ఆమె నివసించే ఫ్లాట్ లో నిజంగానే దెయ్యం ఉందని తెలుసుకొంటారు. అసలు దెయ్యం ఆన్యాను ఎందుకు వెంబడిస్తోంది? ఆ దెయ్యం టార్గెట్ ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఆన్యాస్ టుటోరియల్” సిరీస్ కథాంశం.
నటీనటుల పనితీరు: ఈ సిరీస్ లో టైటిల్ పాత్ర పోషించిన నివేదితా సతీష్ తన స్క్రీన్ ప్రెజన్స్ తో మాయ చేసింది. ఆమె హావభావాలు ఆడియన్స్ ను సిరీస్ లో లీనం చేస్తాయి. ఆమె కళ్ళతో పండించిన ఎమోషన్స్ & ఎలివేట్ చేసిన ఫియర్ సిరీస్ కు హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి రెజీనా సపోర్టింగ్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. మిగతా ఆర్టిస్టులు ఎక్కువగా తమిళ నటులు కావడంతో.. వాళ్ళకి పెద్దగా కనెక్ట్ అవ్వలేరు.
సాంకేతికవర్గం పనితీరు: విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ సిరీస్ కి మెయిన్ హైలైట్. లిమిటెడ్ స్పేస్ ను యూజ్ చేసుకుని.. 7 ఎపిసోడ్స్ లో ఎక్కడా లొకేషన్ యాంగిల్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్తపడిన విధానం ప్రశంసనీయం. అర్రోల్ కోరెల్లి నేపధ్య సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ. చాలా సింపుల్ ఎమోషన్స్ ను మ్యూజిక్ తో ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కి ఎక్కువ మార్కులు పడతాయి.
రచయిత సౌమ్య శర్మ, దర్శకురాలు పల్లవి గంగిరెడ్డిలు సిరీస్ ను రన్ చేసిన విధానం బాగుంది. లాక్ డౌన్ ను సిరీస్ కోసం వినియోగించిన విధానం, అలాగే కరెంట్ సోషల్ మీడియా ట్రెండ్ ను, యూత్ ఆడియన్స్ ను కనెక్ట్ చేసేలా కథనాన్ని తీర్చిదిద్దిన తీరు సిరీస్ కు ఆడియన్స్ ను విశేషంగా కనెక్ట్ చేస్తుంది. సీ.జీ వర్క్ ఒక్కటే మైనస్ గా మారింది. ఆ విషయంలోనూ కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే.. సిరీస్ కు ఇంకాస్త వేల్యూ యాడ్ అయ్యేది.
విశ్లేషణ: 7 ఎపిసోడ్ల సిరీస్ “ఆన్యాస్ టుటోరియల్” హారర్ థ్రిల్లర్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ ను మాత్రమే కాదు.. సిరీస్ లను బింజ్ వాచ్ చేసే నవతరం ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. సో, “ఆహా యాప్”లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ను మీరూ చూసేయండి!
రేటింగ్: 3/5